 
															పత్తి రైతు చిత్తు..!
● తుఫాన్‌తో నేలరాలిన కాయలు
● నష్టాలు తప్పవని
ఆందోళన
కొత్తూరు: ప్రకృతి వైపరీత్యాలు, కూటమి ప్రభుత్వ తీరుతో పత్తి రైతులు చిత్తయ్యారు. జిల్లాలో సాగు చేస్తున్న ప్రధాన వాణిజ్య పంట్లో పత్తిపంట ఒకటి. కొత్తూరు, లావేరు, హిరమండలం, సరుబుజ్జిలి, బూర్జ తదితర మండలాల్లో సుమారు 2,500 ఎకరాల్లో పత్తి పంటను సాగు చేస్తున్నారు. అయితే ఈ ఏడాది కురిసిన భారీ వర్షాలకు పత్తిపంట కాపు అంతంతమాత్రంగానే వచ్చింది. అయితే వచ్చిన పత్తికాయలు కూడా మోంథా తుఫాన్ కారణంగా మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు కుళ్లిపోతున్నాయి. పిందెలు, పువ్వులు పూర్తిగా నేల రాలిపోయాయి. దీంతో పత్తి పంటకు తీవ్రనష్టం వాటిళ్లింది.
పెరిగిన పెట్టుబడులు
మరోవైపు ఈ ఏడాది పత్తిపంట సాగుకు పెట్టుబడులు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రధానంగా యూరియాతో పాటు ఇతర ఎరువులు అవసరానికి తగ్గట్టుగా ప్రభుత్వం సకాలంలో పంపిణీ చేయలేకపోయింది. దీంతో ఒడిశా నుంచి బ్లాక్ మార్కెట్‌లో అధిక రేట్లకు కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. ఎన్నికల సమయంలో కొత్తూరులో పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. అయితే ఇప్పటివరకు కొనుగోలు కేంద్రం మంజూరు కాలేదు. నవంబర్ నెల వస్తున్నా ఇంతవరకు పత్తి పంటను కొనుగోలు చేసేందుకు వ్యాపారులు రావడం లేదు. దీంతో పత్తి రైతులు ఆందోళన చెందుతున్నారు. కష్టాల్లో ఉన్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
 
							పత్తి రైతు చిత్తు..!

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
