 
															మగ ఉపాధ్యాయుల నియామకాలు ఆపాలి
శ్రీకాకుళం: రాష్ట్రవ్యాప్తంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అమ్మాయిల గురుకులాల్లో మగ ఉపాధ్యాయుల నియామకాలు ఆపాలని దళిత ప్రజా సంఘాల నాయకులు కోరారు. ఈ మేరకు నగరంలోని ఆదివారంపేటలో ఉన్న అంబేడ్కర్ విగ్రహం నుంచి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులాల జిల్లా కో–ఆర్డినేటర్ కార్యాలయం వద్దకు దళిత ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా మైనర్ బాలికలపై లైంగిక దాడులు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరారు. అమ్మాయిల గురుకులాల్లో మగ ఉపాధ్యాయులను నియమించవద్దని జునైల్ కోర్టు తీర్పులు ఉన్నప్పటికీ.. గురుకులాల సొసైటీ కార్యదర్శి చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా కో–ఆర్డినేటర్ యశోదలక్ష్మి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో దళిత ప్రజా సంఘాల జేఏసీ జిల్లా కన్వీనర్ దుర్గాసి గణేష్, కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిస్కా కృష్ణయ్య, అంబేడ్కర్ యువజన సంఘం చంద్రమౌళి, మామిడి అప్పలరాం, యడ్ల జానకిరావు, బోనేల చిరంజీవి, తారక, అక్కెన రాజారావు, అనిల్, అంబేద్కర్ ఇండియా మిషన్ జిల్లా నాయకులు నేతల అప్పారావు పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
