 
															అప్రమత్తంగా ఉన్నాం
● విద్యుత్‌శాఖ ఎస్‌ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తి
అరసవల్లి: తుఫాన్ ప్రభావం జిల్లాలో తీవ్ర ప్రభావం చూపుతుందన్న ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో విద్యుత్‌శాఖ పరంగా అన్ని చర్యలతో అప్రమత్తంగా ఉన్నామని ఎస్‌ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తి ప్రకటించారు. ఆదివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ ఈనెల 27వ తేదీ నుంచి 29వ తేదీ వరకూ జిల్లాలో తుఫాన్ తీవ్రంగా ఉంటుందన్న హెచ్చరికల నేపథ్యంలో జిల్లా లోని తీర ప్రాంతంతో పాటు మిగిలిన ప్రాంతాల్లో కూడా విద్యుత్‌శాఖ తరఫున ఆస్తి నష్టం, ప్రాణ నష్టం లేకుండా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ఈ మేరకు జిల్లాలో 36 సెక్షన్‌లలో 500 ట్రాన్స్‌ఫార్మర్లు, 1500 విద్యుత్ స్తంభాలు సిద్ధం చేశామని, అలాగే 347 మంది కాంట్రాక్ట్ సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. శ్రీకాకుళం, పలాస, టెక్కలి డివిజన్ కేంద్రాల్లో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశామని, రెగ్యులర్ ఉద్యోగులందరికీ సెలవులు రద్దు చేసి కచ్చితంగా విధుల్లో ఉండేలా ఆదేశాలు జారీ చేసినట్లు వివరించారు. తాజా సమాచారం మేరకు భారీ వర్షాలు మాత్రమే జిల్లాలో ప్రభావం చూపుతాయన్న సమాచారంతో అందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అలాగే కోనసీమ ప్రాంతమైన అమలాపురంలో ఈ తుఫాన్ ప్రభావ విధులకు జిల్లా నుంచి 80 మంది సిబ్బందిని పంపించినట్లు తెలిపారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
