 
															ప్రభుత్వరంగంలోనే వైద్య కళాశాలలు కొనసాగాలి
● జనవిజ్ఞాన వేదిక రౌండ్ టేబుల్
సమావేశంలో వక్తలు డిమాండ్
శ్రీకాకుళం: ప్రభుత్వ రంగంలోనే వైద్య కళాశాలలు, ప్రజారోగ్య వ్యవస్థను కొనసాగించాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. పీపీపీ విధానంలో మెడికల్ కళాశాలలు అనే అంశంపై ఆదివారం శ్రీకాకుళంలోని యూటీఎఫ్ భవనంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు గొంటి గిరిధర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వివిధ ప్రజాసంఘాల నాయకులు, మేధావులు మాట్లాడుతూ రాజ్యాంగంలోని ఆర్టికల్–21లో జీవించే హక్కు కల్పించారని, అందులో భాగంగా దేశంలోని ప్రతి పౌరుడు ప్రభుత్వం ద్వారా వైద్యం పొందవచ్చన్నారు. ప్రభుత్వం నిర్మించి నిర్వహించాల్సిన 10 ప్రభుత్వ వైద్య కళాశాలలను జీవో 590తో పీపీపీ విధానంలోకి మార్చడం ప్రజల హక్కులను కాలరాయడమేనని చెప్పారు. వైద్య కళాశాలల్లో వైద్య విద్యను పొందడమే కాకుండా ప్రతి కళాశాలకు అనుబంధంగా 420 పడకల ఆసుపత్రి అందుబాటులో ఉండటంతో ఆయా ప్రాంతాల్లో పేద మధ్యతరగతి ప్రజలు ఉచిత వైద్యం పొందవచ్చని తెలిపారు. వైద్య కళాశాలల ఆస్పత్రుల ప్రైవేటీకరణ వల్ల ఈ అవకాశాన్ని పేద ప్రజలు కోల్పోతారన్నారు. ప్రజల ఆరోగ్య హక్కులను పేద ప్రజల వైద్యానికి హామీ ప్రభుత్వ వైద్య కళాశాలల్లోనే సాధ్యమవుతుందన్నారు. గతంలో మంజూరైన 17 వైద్య కళాశాలల్లో 10 కళాశాలలను పీపీపీ పేరుతో ప్రైవేటీకరించే చర్యలను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వైద్య విద్యను ఆరోగ్యాన్ని అంగడి సరుకుగా మార్చే ప్రైవేటీకరణ విధానాలను విరమించుకోవాలన్నారు. రాష్ట్ర జీడీపీలో ఐదు శాతం వైద్య రంగానికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైద్య కళాశాలల రక్షణకు జేవీవీ చేస్తున్న కృషిలో ప్రజలంతా భాగస్వాములు కావాలని కోరారు. త్వరలో ప్రముఖులతో సంతకాల సేకరణ నిర్వహించాలని, కరపత్రాలతో ప్రజానీకాన్ని చైతన్యపరచాలని, వైద్య కళాశాలలు ప్రైవేటీకరణ ఆగేంత వరకు ఉద్యమించాలని సమావేశం తీర్మానించింది. సమావేశంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు మేధావులు, జిల్లా ప్రముఖులు నల్లి ధర్మారావు, ప్రొఫెసర్ విష్ణుమూర్తి, డాక్టర్ కె.శ్రీనివాస్ (ప్రజారోగ్య వేదిక ), కుప్పిలి కామేశ్వరరావు (జేవీవీ), పేకల తేజేశ్వరరావు(సీఐటీయూ), బమ్మిడి శ్రీరామ్మూర్తి(యూటీఎఫ్), కె.శ్రీనివాస్(సాహితీ స్రవంతి), బలివాడ ధనుంజయరావు(ఎల్‌ఎఫ్‌ఎల్‌హెచ్‌ఎంఎస్), బోనెల రమేష్(ఏపీ ఎస్సీఎస్టీయూఎస్), బొడ్డేపల్లి మోహనరావు(ఐలు), మిస్కా కృష్ణయ్య(కేఎన్‌పీఎస్), సీహెచ్ శ్రీనివాస్, రామ్మోహన్(ఏపీటీఎఫ్ 257), బి.వెంకటేశ్వర్లు(ఏపీటీఎఫ్ 1938), కింజరాపు నూకరాజు(ఎస్సీఎస్టీటీఎఫ్), రమేష్‌బాబు(బీటీఏ), పి.మోహనరావు(జన సాహితీ), ఎం.రామ్మోహనరావు(ప్రైవేటు విద్యాసంస్థలు), ఆర్.చిన్నారావు(రిమ్స్), భాస్కరరావు(సీపీఎస్‌యూఎస్), డాక్టర్ కె.ఉదయ్‌కిరణ్(బి.ఆర్.ఎ.యు), గణపతి (పోస్టల్), గణేష్ (దళిత ఐక్యవేదిక), బి.ధనలక్ష్మి(యూటీఎఫ్), తంగి ఎర్రమ్మ(రచయిత), కె.గణపతి, ఎం.గోవర్ధనరావు(పట్టణ పౌర సంక్షేమ సంఘం), రౌతు శంకరరావు(వైఎస్సార్ సీపీ), పి.సుధాకర్‌బాబు, బి.జగన్నాథరావు(జన విజ్ఞాన వేదిక జిల్లా నాయకులు), కొత్తకోట అప్పారావు, బొడ్డేపల్లి మోహనరావు, ఎం.పద్మనాభరావు, పాలవలస ధర్మారావు, పాలకొండ కూర్మారావు, బొడ్డేపల్లి జనార్ధన రావు, పేడాడ వేదవతి, హెచ్ మన్మధరావు, బి ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
