 
															దళిత కుటుంబాలపై అక్రమ కేసులు అన్యాయం
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): కూటమి ప్రభుత్వం దళిత వ్యతిరేకిగా వ్యవహరిస్తోందని, దళిత కుటుంబాలపై అక్కసుతో అక్రమ కేసులు నమోదు చేస్తూ వేధింపులకు పాల్పడుతోందని వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ముంజేటి కృష్ణ అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఎనిమిది మంది నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులతో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో రాష్ట్రంలోని దళితులంతా వైఎస్సార్ సీపీకి ఓట్లు వేయడాన్ని జీర్ణించుకోలేక కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోనూ, జిల్లాలలోనూ దళితులపై అక్రమ కేసులు బనాయించి గ్రామాల్లో వేధింపులకు గురి చేయడం అన్యాయమన్నారు. విద్యతోనే పేదరిక నిర్మూలన సాధ్యమని నమ్మిన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంటు పథకం తీసుకొచ్చారని, ఎంతోమంది దళిత బిడ్డలకు ఉన్నత స్థానాలు రావడానికి కారణమైందని గుర్తు చేశారు. తర్వాత తండ్రి ఆశయాలను వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తన పాలనతో కొనసాగించారని చెప్పారు. కూటమి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేయాలని చూస్తోందని, దీనివల్ల దళితులు వైద్య విద్యకు దూరమవుతారన్నారు. నియోజకవర్గాల్లోని ఉన్న దళిత విభాగాన్ని చైతన్యంచేస్తూ అంబేడ్కర్ విగ్రహాల నిరసన తెలియజేయాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తోందన్నారు. కల్తీ మద్యం వల్ల ఎక్కువగా ఆర్థికంగా వెనకబడిన దళిత కుటుంబాలే బలైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు సతివాడ రామినాయుడు. నియోజకవర్గాల అధ్యక్షులు యజ్జల గురుమూర్తి, కల్లేపల్లి లక్ష్మణరావు, గుజ్జల యోగేశ్వరరావు, నేతల కృష్ణ, జె.జయరాం, వావిలపల్లి శ్రీనివాసరావు, లండ కిరణ్, రేగిడి లక్ష్మణరావు, మజ్జి రమణ పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
