 
															బాలికల గురుకులాల్లో పురుషుల నియామకం వద్దు
శ్రీకాకుళం పాతబస్టాండ్: బాలికలు చదువుతున్న గురుకులాల్లో నిబంధనలకు వ్యతిరేకంగా పురుష ఉపాధ్యాయులను ప్రభుత్వం నియమించిందని, వారిని వెంటనే గురుకులాల నుంచి రిలీవ్ చేయాలని దళిత, ఆదివాసీ ప్రజా సంఘాల జేఏసీ ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్‌కు ఆయన చాంబర్‌లో కలిసి వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బాలికలపై వరుసగా జరుగుతున్న అఘాయిత్యాలు, దాడులు నేపథ్యంలో ఇలాంటి నియామకాలు చేపట్టడం తగదన్నారు. జువైనల్ కోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా గురుకులాల్లో డీఎస్సీ ద్వారా పురుష ఉపాధ్యాయుల నియామకాలు చేపడుతున్న గురుకులాల సొసైటీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో దళిత ఆదివాసీ ప్రజా సంఘాల జేఏసీ జిల్లా కన్వీనర్ దుర్గాసి గణేష్, కులనిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిస్కా కృష్ణయ్య, అంబేద్కర్ ఇండియా మిషన్ జిల్లా నాయకులు నేతల అప్పారావు, అంబేద్కర్ యూనివర్సిటీ చైర్ సాధన సమితి జిల్లా కన్వీనర్ టి.రమణ, దళిత హక్కుల పరిరక్షణ సమితి జిల్లా నాయకులు బైరి ధనరాజ్, మాలమహానాడు జిల్లా నాయకులు ముచ్చ శ్యాంసుందర్, బి నర్సింహం పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
