
కింజరాపు ఏజెన్సీ ద్వారా మైనింగ్ దోపిడీ
● ధ్వజమెత్తిన పేరాడ తిలక్
టెక్కలి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో కి వచ్చిన తర్వాత టెక్కలి నియోజకవర్గంలో కింజరాపు ఏజెన్సీ ద్వారా పెద్ద ఎత్తున మైనింగ్ దోపిడీ జరుగుతోందని వైఎస్సార్‌సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ ఆరోపించారు. సోమ వారం టెక్కలిలోని ఆ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. మైనింగ్ కార్యకలాపాల కోసం గతంలో విశ్వ సముద్ర, ఏఎంఆర్ సంస్థలు ఉండేవని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు సోదరుడు హరిప్రసాద్ నేతృత్వంలో కింజరాపు ఏజె న్సీగా మారిందన్నారు. టెక్కలి మండలంలోని గూ డేం, అడ్డుకొండ, కోటబొమ్మాళి మండలంలోని అక్కయ్యవలస, కొత్తపేట, శ్రీజగన్నాథపురం, పొడుగుపాడు, చిన్నసాన, జర్జంగి, సంతబొమ్మాళి మండలంలోని నర్సాపురం, గోవిందపురం, సంతబొ మ్మాళి, వెంకటాపురం, నందిగాం మండలంలోని తురకలకోట, సొంటినూరు, బెజ్జిపల్లి, కొండతెంబూరు తదితర ప్రాంతాల్లో మంత్రి అండదండలతో మైనింగ్ మాఫియా జరుగుతోందని దుయ్యబట్టారు.
కక్ష సాధింపులు చేస్తున్నారు
అనుమతులు ఉన్న క్వారీలు, క్రషర్లు, ఫ్యాక్టరీలపై కక్ష సాధింపులు చేస్తూ, అనుమతులు లేని క్వారీలు, క్రషర్లు, ఫ్యాక్టరీలను నడిపించడానికి రాజస్థాన్‌కు చెందిన వ్యక్తికి అధ్యక్ష పదవి కట్టబెట్టారని మండిపడ్డారు. ప్రతి నెలా ఒక్కో క్వారీ నుంచి మంత్రి సోద రుడికి 4 గ్రానైట్ బ్లాకులు ఉచితంగా ఇస్తున్నారని, దీంతో అక్రమ మైనింగ్ చేసినా అధికారులు పట్టించుకోకుండా ఉండేవిధంగా డీల్ కుదుర్చుకున్నారని ధ్వజమెత్తారు. నందిగాం మండలంలోని కణితూరు గ్రామంలో శ్మశానవాటికకు విద్యుత్ సదుపాయం కల్పించే విషయంలో సైతం అధికారులతో మంత్రి కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం విడ్డూరంగా ఉందన్నారు. తన ఆరోపణల్లో ఎక్కడైనా అవాస్తవం ఉందని నిరూపిస్తే దేనికై నా సిద్ధంగా ఉన్నానని తిలక్ సవాల్ విసిరారు. మూలపేట పోర్టు సీఎం చంద్రబాబు తీసుకువచ్చారని కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.