
అర్జీదారుల సమస్యలు పరిష్కరించాలి
పలాస: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీదారుల వినతులను పరిశీలించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ స్పప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. మండలంలోని తహసీల్దార్ కార్యాలయం పక్కనే ఉన్నటువంటి ఉప ఖజానా కార్యాలయంలో ప్రజా సమస్యల నమోదు, పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలకు సంబంధించి మొత్తం 120 వినతులు స్వీకరించారు. దీనిలో ముఖ్యంగా పింఛన్లు, భూ సమస్యలు, రోడ్లు, డీ–పట్టా భూములు, మంచినీరు, గృహ నిర్మాణాలు, సదరం, రేషన్‌కార్డులు వంటి సమస్యలపై ఫిర్యాదులు ఉన్నాయి.
వైద్యులను నియమించాలి
కాశీబుగ్గలో గత ప్రభుత్వంలో నిర్మించిన కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌లో పూర్తిస్థాయిలో వైద్యులను నియమించాలని ఉద్దానం ఆరోగ్య పరిరక్షణ కమిటీ ప్రతినిధులు విన్నవించారు. ప్రతిరోజూ ఉద్దానం ప్రాంతం నుంచి రోజుకు కనీసం 60 మందికి తగ్గకుండా డయాలసిస్ చేయించుకోవడానికి వస్తున్నారని, అందుకే డయాలసిస్ యూనిట్లను పెంచాలని విన్నవించారు. అలాగే సీరం క్రియేటిన్ 3 దాటిన వారికి కనీసం రూ.5 వేలు ఫించను ఇవ్వాలని, ఆస్పత్రిలో రోగులకు ఉచిత భోజన సదుపాయం కల్పించాలని కోరారు. అదేవిధంగా తమకు సంబంధించిన జిరాయితీ భూమిని పలాస పెద్దవీధికి చెందిన టీడీపీ కౌన్సిలర్ భర్త కృష్ణనాయక్, అతని బంధువులు పొందర త్రిలోచన, పొందర బలరాం, పొందర ప్రభాపాత్రో తదితరులు ఆక్రమించుకోవడానికి చూస్తున్నారని పలాసలోని ఉదయపురం గ్రామానికి చెందిన రాజాం ఆదమ్మ, ఆమె కుమారులు గణపతి, సురేష్, రవి, గిరి, మురళి తదితరులు వినతిపత్రం అందజేశారు. ఉద్దానం ప్రాంత జీడి పిక్కలకు తగిన గిట్టుబాటు ధర కల్పించాలని జీడి రైతాంగ కమిటీ ప్రతినిధులు కోరారు. నందిగాం మండలం కణితూరు శ్మశానవాటికకు విద్యుత్ లైన్ ఏర్పాటు విషయంలో టీడీపీ నాయకులు రాజకీయం చేస్తూ పనులు అడ్డుకుంటున్నారని ఎంపీపీ నడుపూరు శ్రీరామమూర్తి ఫిర్యాదు చేశారు.
కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జెడ్పీ సీఈవో ఎల్.శ్రీధర్‌రాజు, డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ కిరణ్‌కుమార్, డ్వామా పీడీ సుధాకర్, పలాస ఆర్డీవో జి.వెంకటేష్, డీఎంఅండ్‌హెచ్‌వో కల్యాణబాబు, వికలాంగుల సంక్షేమ శాఖ ఏడీ కవిత, పలాస–కాశీబుగ్గ మున్సిపల్ కమిషనర్ ఎన్.రామారావు, పలాస తహసీల్దార్ కల్యాణ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.
అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్లాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: అర్జీల పరిష్కారానికి క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలించాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదికలో ఆయన అర్జీదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. అర్జీల పరిష్కారానికి సంబంధిత అర్జీదారుని వద్దకు క్షేత్రస్థాయిలోకి వెళ్లి మాట్లాడి వారికి నాణ్యమైన సమాచారం అందజేయాలన్నారు. రెవెన్యూ, పంచాయతీ రాజ్, డ్వామా, మహిళా శిశు సంక్షేమం, మున్సిపల్ కార్పొరేషన్, జిల్లా పంచాయతీ, ఏపీఈపీడీసీఎల్, సర్వే, భూగర్భ గనులు, ఇరిగేషన్, తదితర శాఖల సమస్యలపై 217 అర్జీలు స్వీకరించారు. అర్జీలు స్వీకరణలో డిప్యూటీ కలెక్టర్లు పద్మావతి, అప్పారావు, ఐసీడీఎస్ పీడీ బి.శాంతిశ్రీ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ స్పప్నిల్ దినకర్ పుండ్కర్
పలాసలోని పీజీఆర్‌ఎస్‌లో 120 వినతుల స్వీకరణ

అర్జీదారుల సమస్యలు పరిష్కరించాలి

అర్జీదారుల సమస్యలు పరిష్కరించాలి