టెక్కలి: నూతన విద్యా విధానంలో భాగంగా విలీనం పేరిట జిల్లాలో అనేక ప్రభుత్వ పాఠశాలలను ప్రభుత్వం మూసివేస్తోంది. పిల్లలు తక్కువగా ఉన్నారని, ఇతర కారణాలు చూపుతూ గ్రామాలకు సర్కారు బడులను దూరం చేస్తోంది. ఊరి బడితో ఎంతో అనుబంధం కలిగిన ఆయా గ్రామాల ప్రజలు ప్రభుత్వ వైఖరి పట్ల మండిపడుతున్నారు. ఎలాగైనా తమ పాఠశాల మూతపడకుండా ఉండేందుకు భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే టెక్కలి మండలం గంగాధరపేటలో గ్రామస్తులు ఏకతాటిపైకి వచ్చి పిల్లలను బడిలో చేర్పించడంతో పాటు మౌలిక వసతులు కల్పించి అదనంగా వలంటీర్‌ను సైతం నియమించి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
సొంత ఖర్చులతో నిర్వహణ...
గంగాధరపేట ప్రాథమిక పాఠశాలలో గతంలో 13 మంది వరకు విద్యార్థులు ఉండేవారు. గత రెండేళ్లుగా విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పడుతూ వస్తోంది. ఈ ఏడాది పూర్తిగా ఒకే ఒక్క విద్యార్థికి పరిమితమైంది. దీంతో పాఠశాల కొనసాగింపు విషయంలో గ్రామస్తుల్లో ఆందోళన మొదలైంది. పిల్లలు లేకపోతే పాఠశాల ఎత్తివేస్తారని తెలిసి ఎలాగైనా పాఠశాలలో విద్యార్థులను చేర్పించి బడిని బతికించాలనే నిర్ణయానికి వచ్చారు. అప్పటికే గ్రామం నుంచి ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న పిల్లల్ని తిరిగి గ్రామ పాఠశాలలో చేర్పించాలని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. దీంతో ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య 19కు చేరింది. ఇప్పటికే ఒక టీచర్ ఉన్నప్పటికీ అదనంగా సొంత ఖర్చుతో విద్యా వలంటీర్‌ను ఏర్పాటు చేశారు. విద్యార్థులకు అవసరమైన మినరల్ వాటర్, ఇతర గ్రామాల నుంచి వస్తున్న విద్యార్థులను సురక్షితంగా ఇళ్లకు తీసుకువెళ్లడానికి సొంతంగా ఆటో ఏర్పాటు చేశారు. గ్రామానికి చెందిన ఆర్మీ ఉద్యోగులు పిల్లల కోసం భోజనం ప్లేట్లు, మరికొంత మంది గ్రామస్తులు బెంచీలను వితరణగా అందజేశారు. పాఠశాలకు రంగులు వేయించడమే కాకుండా పాఠశాలకు ఆనుకుని విద్యార్థుల ఆట వస్తువుల కోసం చిన్న పాటి మైదానాన్ని సిద్ధం చేస్తున్నారు.
ప్రైవేట్ స్కూల్ మాన్పించేశా..
గ్రామ పెద్దలు, యువకులంతా మాలో చైతన్యం కల్పించారు. ఎలాగైనా మా గ్రామంలో పాఠశాలను బతికించుకోవాలనే ఆలోచనతో టెక్కలిలో ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న ఇద్దరు పిల్లల్ని మా గ్రామంలో ప్రభుత్వ బడిలో చేర్పించాను. నాతో పాటు ఎంతో మంది ఇలాగే వారి పిల్లల్ని మా ఊరి బడిలో చేర్పించారు.
– బి.శ్రీనివాసరావు, విద్యార్థుల తండ్రి,
గంగాధరపేట
పాఠశాలను వదులుకోం...
గ్రామంలో ఎన్నో దశాబ్దాలుగా ప్రాథమిక పాఠశాల ఉంది. అయితే ఇటీవల విద్యార్థుల సంఖ్య పూర్తిగా పడిపోయింది. దీంతో పాఠశాల మూసివేస్తారనే భయం మా గ్రామంలో ఏర్పడింది. ఎట్టి పరిస్థితుల్లో పాఠశాలను వదులుకోకూడదనే సంకల్పంతో అన్ని వర్గాల ప్రజలతో పాటు యువకుల సాయంతో స్వచ్ఛందంగా అభివృద్ధి చేస్తున్నాం.
– సంపతిరావు ధర్మారావు,
గ్రామపెద్ద, గంగాధరపేట
గంగాధరపేట పాఠశాలకు మూసివేత ముప్పు
బడిని కాపాడుకునేందుకు రంగంలోకి దిగిన గ్రామస్తులు
ప్రైవేటు స్కూళ్లలో పిల్లలను మాన్పించి పాఠశాలలో చేర్పిస్తున్న వైనం
సొంత ఖర్చులతో మౌలిక సదుపాయాల ఏర్పాటు
అందరి సహకారంతో..
పాఠశాల అభివృద్ధి విష యంలో గ్రామస్తుల సహకారం మరువలేనిది. ముఖ్యంగా విద్యార్ధుల తల్లిదండ్రులు చైతన్యవంతమై ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న వారి పిల్లల్ని ప్రభుత్వ బడిలో చేర్పించారు. బడిని బతికించుకోవడానికి మేము చేస్తున్న కార్యక్రమాలకు ఉపాధ్యాయురాలు ఎంతగానో సహకరిస్తున్నారు. గ్రామస్తులతో పాటు యువకులు, ఆర్మీ ఉద్యోగులు, మిగిలిన వారు వారి తోచినవిధంగా సాయం చేస్తున్నారు.
– బమ్మిడి లక్ష్మీపతి, గంగాధరపేట,
టెక్కలి మండలం
గ్రామస్తుల కృషి అభినందనీయం..
గంగాధరపేటలో ప్రాథమిక పాఠశాలకు ఇటీవల బదిలీపై వచ్చాను. నేను వచ్చినప్పటికే విద్యార్థుల సంఖ్య పూర్తిగా శూన్యంగా ఉండేది. ఈ నేపథ్యంలో విద్యార్థులను చేర్పించడమే కాకుండా మౌలిక సదుపాయాలు కల్పించడానికి గ్రామస్తులు పడుతున్న ఆరాటం చూస్తే ఎంతో ఆనందంగా ఉంది. ప్రతి గ్రామంలోనూ ఇలాగే చేస్తే ప్రభుత్వ పాఠశాలలు ఎంతో బాగుపడతాయి. ఇక్కడి గ్రామస్తుల కృషి ఆదర్శనీయం.
– బి.భవానీ, ఉపాధ్యాయురాలు,
గంగాధరపేట
ఊరి బడికి ఊపిరి
ఊరి బడికి ఊపిరి
ఊరి బడికి ఊపిరి
ఊరి బడికి ఊపిరి
ఊరి బడికి ఊపిరి
ఊరి బడికి ఊపిరి
ఊరి బడికి ఊపిరి
ఊరి బడికి ఊపిరి
ఊరి బడికి ఊపిరి