
ఉద్యోగులకు పీఆర్‌సీ ఎప్పుడిస్తారు?
శ్రీకాకుళం న్యూకాలనీ: ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లకు కొత్త పీఆర్‌సీ ఇచ్చే ఉద్దేశం ఉందో లేదో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేయాలని ఎస్టీయూ రాష్ట్ర కార్యదర్శి ఎస్.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఆదివారం శ్రీకాకుళం నగరంలోని దాసరి క్రాంతి భవన్‌లో ఆదివారం జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 11వ వేతన సవరణ గడువు ముగిసి రెండేళ్లు పూర్తి కావస్తున్నా 12వ వేతన సవరణ ఊసే లేదన్నారు. అసలు పీఆర్‌సీ చైర్మన్‌ను ఇంతవరకు నియమించకపోవడం తగదన్నారు. పీఆర్‌సీపై ఇప్పటికై నా స్పష్టత ఇవ్వకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదని హెచ్చరించారు. జిల్లా అధ్యక్షుడు ఎస్వీ రమణమూర్తి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యమంటూ ఒక ప్రక్క ప్రకటనలు చేస్తూ కార్పొరేట్ పాఠశాలలకు తల్లికి వందనం పథకం అమలు చేయడంలో ప్రభుత్వం కుట్ర దాగి ఉందని ఆరోపించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రమణ మాట్లాడుతూ విద్యార్థులను తరలించకుండా మోడల్ పాఠశాలలు ఏర్పాటు చేయమని ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పినా వినకుండా విద్యార్థులను సమీప పాఠశాలలకు తరలించి మోడల్ విధానమంటూ ఏకోపాధ్యాయ పాఠశాలలను పెంచిందని దుయ్యబట్టారు. సమావేశంలో పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షుడు పాలక పురుషోత్తం, ఆర్థిక కార్యదర్శి పి.రామకృష్ణ, జిల్లా కార్యవర్గ సభ్యులు పి.తమ్మినాయుడు, చింతల రామారావు, కూన శ్రీనివాసరావు, బి.సత్యం, ఎస్.రామచంద్ర, హనుమంతు రామకృష్ణ, జి.తిరుమలరావు, డీవీఎస్ పట్నాయిక్, వివిధ మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, జిల్లా మండల కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.