
ఓహెచ్..తూచ్!
శ్రీకాకుళం: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో శుక్రవారం గందరగోళం నెలకొంది. ఆప్షనల్ హాలిడే(ఓహెచ్)ను గురువారం రాత్రి వేళ రద్దు చేయడమే దీనికి కారణం. వివరాల్లోకి వెళితే.. విద్యాశాఖ ప్రతి సంవత్సరం పాఠశాలల పని దినాలకు సంబంధించిన ముందుగానే క్యాలెండర్‌ను విడుదల చేయడం పరిపాటి. ఈ ఏడాది ఐదు రోజులు ఆప్షనల్ హాలిడే ఇచ్చుకునే సౌలభ్యం కల్పించారు. దీని ప్రకారం స్థానిక పండుగలు, ప్రత్యేక రోజుల్లో ఆ సెలవులను పాఠశాల స్థాయిలోనే ప్రకటించుకునే వీలుంటుంది.
శుక్రవారం రథయాత్ర ప్రారంభం కావడంతో జిల్లాలోని పాఠశాలలకు ఆప్షనల్ సెలవు ప్రకటించారు. ఈ మేరకు గురువారం సాయంత్రమే విద్యార్థులకు సెలవు సర్క్యులర్ పంపించారు. ఉపాధ్యాయులు కూడా నిబంధనలు మేరకు యాప్‌లో ఓహెచ్‌గా నమోదు చేసేశారు. అయితే గురువారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఓహెచ్‌ను రద్దు చేస్తున్నట్లు జిల్లాకు వర్తమానం పంపించారు. దీంతో శుక్రవారం ఉపాధ్యాయులు పాఠశాలలకు వెళ్లినప్పటికి, అప్పటికే ఓహెచ్ నమోదు కావడంతో బయోమెట్రిక్ హాజరు వేయలేకపోయారు. విద్యార్థులకు సెలవు అని చెప్పడంతో వారెవరు పాఠశాలకు రాలేదు. పాఠశాల సమీపంలోని విద్యార్థులకు కబురు పంపించి రప్పించినప్పటికి సమీప గ్రామాల్లోని విద్యార్థులు మాత్రం హాజరు కాలేదు. సెలవు అని చెప్పడంతో వంట కార్మికులు కూడా రాకపోవడంతో వారిని అప్పటికప్పుడు పిలిపించి వంట చేయించాల్సి వచ్చింది. ఇది ఇలా ఉంటే జూలై 5న మొహరం సందర్భంగా ఆప్షనల్ హాలీడేను ప్రకటించారు. ఆ రోజున ప్రభుత్వం పేరెంట్స్ డే నిర్వహించాలని ఆదేశించడంతో ఆ నాటి ఆప్షనల్ హాలీడే కూడా రద్దు అయినట్టే. దీంతో రెండు సెలవులు కోల్పోయామని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పాఠశాలలకు సెలవు విషయంలో గందరగోళం
రాత్రి వేళ ఆదేశాలు రావడంతో ఇబ్బందులు