
ప్రాణం తీసిన సిగరెట్ అలవాటు
నరసన్నపేట: మడపాం టోల్‌గేట్ సమీపంలో గురువారం రాత్రి విద్యుత్ షాక్‌కు గురై యువకుడు మృతిచెందగా..మరొకరు గాయపడ్డారు. కుటుంబ సభ్యులు, స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాలకొండపేట కు చెందిన పాలకొండ రమేష్(24) డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. గురువారం రాత్రి స్నేహితుడు బమ్మిడి గణేష్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై మడపాం టోల్‌గేట్ వద్దకు వెళాడు. అక్కడున్న గాయిత్రి టీ షాపులో టీ తాగారు. రాత్రి 11.30 సమయంలో సిగరెట్ తాగేందుకు మూసి ఉన్న షాపు వెనుక భాగం బాత్‌రూమ్ పైకి ఎక్కారు. అక్కడ 11 కె.వి. విద్యుత్ వైర్లు తగలడంతో షాక్‌కు గురయ్యారు. ఈ ఘటనలో రమేష్ అక్కడికక్కడే మృతి చెందగా.. గణేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చేతికి అందివచ్చిన కుమారుడు మృత్యువాత పడటంతో రమేష్ తల్లిదండ్రులు అప్పన్న, పార్వతి, సోదరుడు సంతోష్ కన్నీరుమున్నీరుగా విలపించారు. సిగరెట్ అలవాటు ప్రాణం మీదకు తెచ్చిందని స్థానికులు అంటున్నారు. విషయం తెలుసుకున్న నరసన్నపేట ఎస్‌ఐ సీహెచ్ దుర్గాప్రసాద్ సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తండ్రి అప్పన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేశారు.
విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి
మడపాం టోల్‌గేట్ సమీపంలో ఘటన

ప్రాణం తీసిన సిగరెట్ అలవాటు