
చెరువులోకి పరిశ్రమ వ్యర్థ జలాలు
రణస్థలం: మండలంలోని రణస్థలం పంచాయతీ సీతంపేట గ్రామానికి చెందిన చెరువులోకి బంటుపల్లి సమీపంలో ఉన్న యూబీ పరిశ్రమ వ్యర్థ జలాలు హైవే కాలువ ద్వారా వచ్చి చేరుతున్నాయని గ్రామస్తులు భావరాజు లక్ష్మణరావు, బత్తుల అన్నారావు, భావరాజు ఆనందరావు, పడాల దుర్గారావు, వంక రాంబాబు, భావరాజు రాంబాబు, రాజు, పడాల శ్రీను ఆరోపించారు. ఈ మేరకు గురువారం యూబీ పరిశ్రమ వ్యర్థ జలాలు చెరువులోకి చేరుతున్న తీరును విలేకరులకు చూపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యర్థ జలాల కారణంగా తీవ్రమైన దుర్వాసన రావడమే కాకుండా గ్రామమంతా ఈగలు, దోమలు వ్యాప్తి చెందుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భూగర్భ జలాలు పాడైపోయి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని చెప్పారు. చెరువులో ఉన్న చేపలు చనిపోతున్నాయని, పశువులు కూడా చెరువు నీరు తాగలేకపోతున్నాయని వాపోయారు. కాలుష్యం కారణంగా అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతున్నాయని చెప్పారు. వ్యర్థ జలాల విషయమై గతంలో స్థానిక ప్రజాప్రతినిధి వద్దకు వెళితే ఆ కాలుష్య నీరు పంట పొలాలకు మంచిదేనని చెప్పడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. ఇప్పటికై నా కాలుష్య నియంత్రణ అధికారులు స్పందించి చెరువును పరిశీలించి తగు చర్యలు చేపట్టాలని కోరారు.
పరిశ్రమ వద్ద వ్యర్థ జలాలను చూపుతున్న గ్రామస్తులు

చెరువులోకి పరిశ్రమ వ్యర్థ జలాలు