
తమ్ముడి హత్య కేసులో అన్న అరెస్టు
నందిగాం: తమ్ముడిని హత్య చేసిన ఘటనలో నిందితుడైన అన్నను గురువారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి టెక్కలి సీఐ కె.శ్రీనివాసరావు విలేకర్లకు వివరాలు వెల్లడించారు. నందిగాం మండలం కామధేనువు గ్రామానికి చెందిన కిల్లి లక్ష్మణనాయుడుకు ధర్మారావు, నీలకంఠం, తవిటయ్య అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. తన భూమిలో కొంత ఉంచుకొని మిగతాది ముగ్గ్గురికి పంచిపెట్టాడు. పెద్దవాడైన ధర్మారావు ఎక్కువ భూమి కావాలని తరుచూ తండ్రితో గొడవ పడేవాడు. ఈ క్రమంలో ఈ నెల 22న ధర్మారావు అడుగుతున్న ఉలిమి మడిలో రెండో కుమారుని భార్య రాములమ్మ విత్తనాలు వేస్తుండగా నిందితుడికి విషయం తెలిసింది. దీనంతటికీ కారణం చిన్న తమ్ముడు తవిటియ్యేనని, అతనిని చంపేస్తే ఏ గొడవ ఉండదని భావించాడు. పారతో ఉలిమి మడి దగ్గరకు వెళ్లి రాములమ్మతో గొడవ పడి పని ఆపితే తవిటయ్య వస్తాడని, అప్పుడు అతనిని చంపేయవచ్చని నిర్ణయించుకున్నాడు. వెంటనే పొలానికి వెళ్లి రాములమ్మతో గొడవ పడ్డాడు. తవిటయ్య రావడంతో పారతో తలపై కొట్టి కిందపడిన తర్వాత కూడా పలుమార్లు గట్టిగా కొట్టి చంపేశాడు. గురువారం నర్సిపురం వద్ద నిందితుడు ధర్మారావు కనిపించగా అదుపులోకి తీసుకొని అరెస్టు చేశామని సీఐ తెలిపారు. నిందితుడిని పలాస కోర్టులో హాజరుపర్చామని సీఐ చెప్పారు. ఎస్సై మహమ్మద్ ఆలీ, కానిస్టేబుల్ రాజు తదితరులు పాల్గొన్నారు.