
రైలు ఢీకొని వ్యక్తి దుర్మరణం
వజ్రపుకొత్తూరు: మండలంలోని పెద్దమురహరిపురం గ్రామానికి చెందిన గొరకల వైకుంఠరావు (33) గురువారం పూండి రైల్వే స్టేషన్ వద్ద గుర్తు తెలియని రైలు ఢీకొని మృతిచెందాడు. జీఆర్‌పీ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వైకుంఠరావు రాజమండ్రిలో కూలి పనులు చేస్తుండేవాడు. ఇటీవల స్వగ్రామం వచ్చాడు. గురువారం తిరిగి రాజమండ్రి వెళ్లేందుకు పూండి రైల్వే స్టేషన్‌కు వచ్చాడు. పాసింజర్ రైలు ఎక్కే ఆతృతతో పట్టాలపై పడిపోయాడు. ఆ సమయంలో రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తండ్రి శ్రీరాములు ఇదివరకే మృతి చెందగా, మతి స్థిమితం లేని తల్లి రాజులమ్మ, తమ్ముడు వెంకటేష్ ఉన్నారు. పూండి రైల్వేస్టేషన్ మాస్టర్ ఫిర్యాదు మేరకు పలాస జీఆర్‌పీ ఎస్‌ఐ ఎస్‌కే షరీఫ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.