జనశక్తి నేత సాంబశివరావు మృతికి సంతాపం
పలాస: బొడ్డపాడులో నివాసముంటున్న సి.పి.ఐ.ఎం.ఎల్ (జనశక్తి) పార్టీ నాయకుడు మారెళ్ల సాంబశివరావు(70) అనారోగ్యంతో మృతిచెందారు. మంగళవారం విప్లవ సంప్రదాయం ప్రకారం భౌతికకాయంపై ఎర్రజెండాను కప్పి పూలమాలలు వేసి ఘనంగా నివాళ్లు అర్పించారు. అనంతరం బొడ్డపాడు కాలనీలోని స్వగృహం వద్దే సంతాప సభను నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ గుంటూరు జిల్లా తెనాలికి చెందిన సాంబశివరావు ఆర్టీసీలో మెకానిక్‌గా పనిచేసి విప్లవోద్యమానికి ఆకర్షితుడై ఉద్యమ అవసరాల కోసం బొడ్డపాడు చేరుకున్నారని, గ్రామానికి చెందిన పి.రాజేశ్వరిని వివాహం చేసుకొని ఇక్కడే స్థిరపడ్డారని తెలిపారు. ఉమ్మడి జనశక్తిపార్టీ, అనంతరం సి.పి.ఐ.ఎం.ఎల్ న్యూడెమొక్రసీ పార్టీలో పనిచేసిన సాంబశివరావు కొద్దిరోజులు పాతపట్నంలో జైలు జీవితం అనుభవించారని గుర్తు చేశారు. కార్యక్రమంలో వివిధ ప్రజాసంఘాల నాయకులు తామాడ సన్యాసిరావు, పోతనపల్లి కుసుమ, మద్దిల రామారావు, రాపాక చిరంజీవి, కుత్తుం దుష్యంతు, పోతనపల్లి మురళి, కోనేరు గురయ్య, మురిపింటి గంగయ్య తదితరులు పాల్గొన్నారు.


