
నా పోర్టు పరిహారం ఏమైంది..?
● టీడీపీ కార్యకర్త ఆవేదన
సంతబొమ్మాళి: మూలపేట పోర్టుకు సంబంధించి రెండోసారి ఎకరాకి రూ.12లక్షల 50వేలు చొప్పున ఇచ్చిన పరిహారం ఏమైందంటూ టీడీపీ కార్యకర్త జీరు ధర్మారావు ప్రశ్నించారు. ఆయన బుధవారం కుటుంబ సభ్యులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. మూలపేట పోర్టు నిర్మాణాన్ని తాను వ్యతిరేకించానని, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో భూములు ఇవ్వడానికి సంతకం కూడా చేయలేదని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి న తర్వాత స్థానిక టీడీపీ నాయకుల ఒత్తిడి మేరకు చివరలో సంతకం చేశానని అన్నారు. తనకు ఎకరా 30 సెంట్లు భూమి ఉంటే 83 సెంట్లకే రూ. 21లక్షల 25వేలు పరిహారం మొదటి విడతగా ఇచ్చారని తెలిపారు. రెండోవిడతగా 23 టీడీపీ కుటుంబాలకు ఎకరాకి రూ.12లక్షల50వేల పరిహారం ఇచ్చారని, తన పరిహారం ఏమైందని స్థానిక టీడీపీ నాయకులను అడిగితే నీ చెక్కు ఫలానా టీడీపీ నాయకుడి దగ్గర ఉంది తీసుకో అని చెప్పి వాళ్ల ఇళ్ల చుట్టూ పలు దఫాలు తిప్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశా రు. టెక్కలి ఆర్‌డీఓ, నౌపడ ఎస్‌ఐలను బుధవారం కలిసి తన బాధను చెప్పినా వాళ్లు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం హయాంలో పోర్టుకు మన భూములు ఇవ్వద్దు మన భూముల్లో అందరం కలిసి వరినాట్లు వేద్దాం, ధర్నాలు చేద్దామని తన కుటుంబం దగ్గర రూ. 7వేలు చొప్పున తీసుకున్నారని, ఆ డబ్బులు కూడా ఇచ్చి వరి నాట్లు వేశానని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తనను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండో విడతగా వచ్చిన పరిహారాన్ని కలెక్టర్ స్పందించి ఇప్పించాలని ధర్మారావు కోరారు.