
రోడ్డున పడనున్న ఎండీయూ ఆపరేటర్లు
వీధివీధితోనూ ఐదేళ్లుగా అనుబంధం పెనవేసుకున్న రేషన్ బళ్లు ఆగిపోనున్నాయి. సామాన్యుడి ఇంటి వద్దకే వచ్చి సరుకులు అందించిన ఈ వాహనాలను కూటమి సర్కారు రద్దు చేసింది. ఇక రేషన్ కోసం డిపో ముందు చేతులు కట్టుకుని నిలబడాల్సిందే. ఇప్పటికే వలంటీర్లను తీసేయడంతో పౌర సేవల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న ప్రజలు.. రేషన్ బళ్ల రద్దుతో మళ్లీ పాత విధానంలో రేషన్ డీలర్ల ముందు నిలబడక తప్పదు.
● ఎండీయూ వాహనాలను రద్దు చేసిన ప్రభుత్వం
● ఇకపై డిపోల వద్దే సరుకులు తీసుకోవాలని ఆదేశం
● వలంటీర్లను తీసేయడంతో ఇప్పటికే నిలిచిపోయిన
ఇంటింటికీ సేవలు
● తాజాగా సరుకుల పంపిణీకి బ్రేక్
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:
రేషన్ సరుకులు ఇక ఇంటికి రావు. ప్రభుత్వ సేవలు ‘ప్రజల వద్దకు’ ఇక చేరవు. వలంటీర్లను తీసేసి ‘పేదోడి సేవ’ తమ పద్ధతి కాదని సంకేతాలు ఇచ్చిన కూటమి సర్కారు.. ఇప్పుడు రేషన్ వాహనాలను రద్దు చేసి తన అజెండాలో పేదవాళ్లు లేరని స్పష్టం చేసేసింది. ఐదేళ్లుగా సేవలు అందించిన రేషన్ వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోతాయి. వాటిపై ఆధారపడి జీవిస్తున్న బతుకులు కూడా పో తాయి. ఈ నిర్ణయంతో చంద్రబాబు నైజమేంటో మరోసారి ప్రజలకు తెలుస్తోందని రాజకీయ వేత్తలు అంటున్నారు.
ఇంటింటికీ సేవలు నిలిపివేత
కూటమి ప్రభుత్వం సంక్షేమాన్నే కాదు ప్రజలకు ఇవ్వాల్సిన సేవలను కూడా వదిలేస్తోంది. వైఎస్ జగన్ ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొచ్చింది. సేవలు అందుకోవడం ప్రజల హక్కు అని భావించి.. సామాన్యుడి ఇంటి వద్దకే అనేక సేవలు అందజేసింది. వలంటీర్ల ద్వారా ప్రజలకు ఏం అవసరమో గుర్తించి, వాటిని నేరుగా అందజేసింది. సంక్షేమ పథకాలతో పాటు అధికారిక సేవలను ఇంటి చెంతకే చేర్చింది. 15వేల మందికి పైగా వలంటీర్ల ద్వారా ప్రజలకు 539 సేవలు అందించింది. రేషన్ అందించడం కోసం వాహనాలను ఏర్పాటు చేసి వేలాది మందికి ఉపాధి చూపించింది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చీ రావడంతోనే వలంటీర్ వ్యవస్థను తీసేసింది. ఫలితంగా ప్రతి పౌర సేవకు ప్రజలు మళ్లీ అధికారుల చుట్టూ తిరగడం తప్పనిసరైంది. ఇప్పుడు రేషన్ వాహనాలను కూడా రద్దు చేయడంతో వాహన డ్రైవర్లు ఉపాధి కోల్పోవడమే కాకుండా.. ప్రజలకు మళ్లీ పాత కష్టాలు మొదలు కానున్నాయి. ఇప్పటికే సర్కారు రేషన్ కోత పెట్టింది. కార్డుదారులందరికీ రేషన్ ఇవ్వడం లేదు. బియ్యంలో భారీగా కోత పెట్టడంతో అందరికీ అందడం లేదు. ఇక, కందిపప్పు, పంచదార ఊసేలేదు. ఆ రెండు సరుకులను అటకెక్కించింది.
చంద్రబాబు మార్క్ కష్టాలు
హామీలివ్వడం అధికారంలోకి వచ్చాక గాలికొదిలేయడం చంద్రబాబుకు పరిపాటి. తాజాగా ఇంటింటికి సరుకులు అందించే ఎండీయూ వాహనాలను రద్దు చేసి, మళ్లీ పాత పద్ధతిలో సరుకులు ఇస్తామని ప్రకటించారు.జిల్లాలో 3129 గ్రామాలు ఉన్నాయి. వాటిలో 6,60,7430 కార్డుదారులు ఉన్నారు. వారందరికీ 10,670మెట్రిక్ టన్నుల మేర రేషన్‌ను పంపిణీ చేయాలి. దానికోసం వైఎస్ జగన్ ప్రభుత్వం 422 ఎండీయూ వాహనాలను పెట్టి ఇంటింటికి స రుకులు పంపిణీ చేసింది. కానీ కూటమి ప్రభుత్వం ఇప్పుడా వాహనాల భారాన్ని భరించలేక ఏకంగా రద్దు చేసేసి పాత పద్ధతిలో పంపిణీ చేస్తామంటోంది. అంటే ప్రజలు రేషన్ డిపోల వద్ద బారులు తీరాల్సి వస్తుంది.
జిల్లాలో ఎండీయూ వాహనాలపై ఆపరేటర్లతో పాటు సిబ్బంది ఆధారపడి ఉన్నారు. ఒక్కో వాహనానికి నెలకి రూ. 18వేల వరకు వచ్చేది. 1500నుంచి 2000 ఇళ్ల వరకు సరుకులు నేరుగా పంపిణీ చేసేవారు. వీరంతా ఇప్పుడు రోడ్డున పడాల్సిందే. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వారి భవిష్యత్ ఆగమ్య గోచరమైంది. వాస్తవంగా ప్రభుత్వంతో చేసుకున్న అగ్రిమెంట్ గడువు ఉంది. కానీ, ఉన్న ఫలంగా వాహనాలను ఆపేయడంతో వారి పరిస్థితి దయనీయంగా తయారైంది. వారంతా ఆందోళన చెందుతున్నారు. రోడ్డెక్కడానికి సిద్ధమవుతున్నారు.

రోడ్డున పడనున్న ఎండీయూ ఆపరేటర్లు