
‘ఎండీయూ వాహనాల రద్దు అన్యాయం’
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): ఎండీయూ వాహనాలు రద్దు చేయడంతో బండిలో ఉన్న కంప్యూటర్ కాటా సర్వీస్ ఇంజినీర్ల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని ఇంజినీర్ బి.అనంతకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినా డ, ఒంగోలు, ఏలూరు తదితర జిల్లాలకు ఎంవిఆర్ టెక్నాలజీ తరఫున నాలుగేళ్లుగా పనిచేస్తున్న తమ బతుకుల్లో నీళ్లు చల్లడం సరికాదన్నారు. కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడంతో కుటుంబాలతో రోడ్డున పడతామన్నారు. అధికారులు, మంత్రులు, ముఖ్యమంత్రి మరోమారు ఆలోచన చేయాలని కోరారు.
చిత్తడి నేలల్లో జీవ వైవిధ్యం
సోంపేట: సోంపేట ప్రాంతంలోని చిత్తడినేలల్లో వెలకట్టలేని జీవవైవిధ్యం ఉందని పర్యావరణ పరిరక్షణ సంఘ అధ్యక్షుడు డాక్టర్ యారడి కృష్ణమూర్తి అన్నారు. అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం సందర్భంగా సోంపేట చిత్తడి నేలల జీవవైవిధ్యంపై ఫొటో ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని లోకానాథేశ్వర కళాసీ సంఘ భవనంలో మంగళవారం నిర్వహించారు. అంతరించిపోతున్న పక్షులు, సీతాకోక చిలుకలు, మత్స్య సంపద, వివిధ రకాల పాములు, మత్స్యకారులు, రైతుల జీవన విధానం ఫొటో లు పర్యావరణ ప్రేమికులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడు తూ సోంపేట మండలంలోని చిత్తడి నేలలు మానవాళికి వెలకట్టలేని సంపద అని అన్నారు. ఈ నేలలను రక్షించుకోవాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ సంఘం, మత్స్యకార ఐక్యవేదిక నాయకులు బార్ల సుందరరావు, నాగు, కోదండ, గంగాదర్ తదితరులు పాల్గొన్నారు.
పక్కాగా సర్వే చేపట్టాలి
నరసన్నపేట: గ్రామాల్లో భూముల రీసర్వేను పక్కాగా చేపట్టాలని సర్వే విభాగం డిప్యూటీ డైరెక్టర్ (విజయవాడ) డీఎల్‌డీఎల్ కుమార్ సూచించారు. మండలంలోని నడగాంలో జరుగుతున్న రీసర్వే ప్రక్రియను మంగళవారం పరిశీలించారు. సర్వే జరుగుతున్న తీరుపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. డీటీ కృష్ణారావు మాట్లాడుతూ నడగాంలో 1,679 ఎకరాలు ఉన్నాయన్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా సర్వే చేయాలని, తప్పులు ఉండకూడదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మండల సర్వేయర్ అప్పలస్వామి పాల్గొన్నారు.
‘తెలుగు మీడియం లేకుంటే ఎలా?’
శ్రీకాకుళం న్యూకాలనీ: జాతీయ విద్యా విధానం–2020లో భాగంగా దేశం అంతటా మాతృభాషలకు ప్రాధాన్యత పెంచుతూ ఉంటే తెలు గు రాష్ట్రంలో మాత్రం తెలుగుభాషకు మంగళం పాడేటట్టుగా ఇక్కడ పాలకులు దుర్మార్గపు ఆలోచన చేస్తున్నారని ఎస్టీయూ జిల్లా అధ్యక్షు డు ఎస్వీ రమణమూర్తి, ప్రధాన కార్యదర్శి గురుగుబెల్లి రమణ ఆరోపించారు. ఏ భాషలో చదువుకోవాలన్నది విద్యార్థి ఇష్టమని.. తెలుగు రాష్ట్రంలో తెలుగు భాషలో చదువుకోవడానికి అవకాశం లేకపోవడం విడ్డూరంగా ఉందన్నా రు. ఈ మేరకు మంగళవారం వారు ఓ ప్రకటన విడుదల చేశారు. మాతృభాషలో చదివితే పిల్లల సృజనాత్మకత పెరుగుతుందని, మనో వికాసం అభివృద్ధి చెందుతుందని ఎన్నో పరిశోధనలు నిరూపిస్తున్నప్పటికీ మన తెలుగు రా ష్ట్రంలో మాత్రం తెలుగు మీడియం లేకపోవ డం తీవ్ర ఆవేదన కలిగిస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇంగ్లిష్‌తో పాటు తెలుగు మీడి యం కూడా సమాంతరంగా ఉండటం వల్ల ఎక్కువ టీచర్ పోస్టులు నియమించాల్సి వ స్తుందని.. తద్వారా ఆర్థిక భారం పెరుగుతుందని భావించి, పాలకవర్గం ఒక్క ఇంగ్లిష్ మీడియంను మాత్రమే కొనసాగిస్తూ తెలుగు మీడియంను అటకెక్కించే కార్యాచరణ చేస్తుందని ఇది ఎంత మాత్రం తగదని మండిపడ్డారు. తెలుగు రాష్ట్రంలో తెలుగు మీడియం కచ్చితంగా ఉండేలా చూడాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
అందుబాటులోకి
సీటీ స్కాన్ సేవలు
టెక్కలి రూరల్: టెక్కలి జిల్లా కేంద్రాస్పత్రిలో సోమవారం సీటీ స్కాన్ సేవలకు అంతరాయం కలిగిన విషయం తెలిసిందే. మంగళవారం మరమ్మతులు నిర్వహించి మళ్లీ సీటీ స్కాన్ సేవలను రోగులకు అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు అక్కడి సిబ్బంది తెలిపారు.