
ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యం తగదు
శ్రీకాకుళం పాతబస్టాండ్: ‘ఐవీఆర్‌ఎస్ ద్వారా ప్రభు త్వం నుంచి ప్రజలకు నేరుగా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ప్రభుత్వ సేవలపై ప్రజలు ఇచ్చే సమాధానం విలువ కలిగి ఉంటుంది. అందుకే ప్రతి శాఖ బాధ్యతతో స్పందించాలి’ అని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్‌న్స్ నిర్వహించి జిల్లా అభివృద్ధిపై ఆయన జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌తో కలిసి విస్తృత స్థాయిలో సమీక్ష నిర్వహించారు.
● జిల్లాలో ఇప్పటివరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా 61,048 ప్రజా ఫిర్యాదులు నమోదుకాగా, వాటిలో 343 ఫిర్యాదులు గడువు మించాయని కలెక్టర్ పేర్కొన్నారు. రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్ శాఖల్లో పెండింగ్ సమస్యలు అ ధికంగా ఉన్నాయని, పరిష్కరించాలన్నారు.
● మండలాల వారీగా ఉపాధి పనుల పురోగతిలో తేడాలు కనిపిస్తున్నాయని, కొన్ని మండలాల్లో 90 శాతం పనులు పూర్తవుతుండగా మరికొన్నింటిలో 50 శాతం కూడా చేరలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
● రెవెన్యూకు సంబంధించి 22(ఎ) రికార్డుల స్వ చ్ఛీకరణ, వివిధ శాఖలతో పెండింగ్‌లో ఉన్న భూ సమస్యల స్థితిగతులు, ముఖ్యంగా వంశధార నదిపై హై లెవల్ బ్రిడ్జి నువ్వలరేవు–మచినీళ్లపేట రహదారి నిర్మాణాలకు సంబంధించిన అడ్డంకులపై చర్చించారు. లావేరు, ఎచ్చెర్ల మండలాల్లో యూనివర్సిటీ స్థాపనకు 30–40 ఎకరాలు, హైడ్రో కార్బన్ కంపెనీ స్థాపనకు 2000 ఎకరాల భూమిని గుర్తించాలని, అలాగే ఏపీఐఐసీ భూ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. అక్రమ ఇసుక రవాణా, నియంత్రణ లేని గ్రానైట్ తవ్వకాలపై కలెక్టర్ స్పందించారు. జిల్లా మైనింగ్ శాఖ కలిసి వచ్చి అక్రమ మైనింగ్‌ను గుర్తించి, అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
● జూన్ 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఆయుష్ శాఖ, అరసవల్లి ఎండోమెంట్ అధికారి సమన్వయంతో ముందస్తు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు.
పలు శాఖల అధికారులతో కలెక్టర్ సమగ్ర సమీక్ష