
డయాలసిస్ కేంద్రం ప్రారంభం
ఇచ్ఛాపురం టౌన్ : ఇచ్ఛాపురం ప్రభుత్వ సామాజిక ఆస్పత్రి ఆవరణలో కిడ్నీ రోగుల కోసం వైఎస్సార్‌సీసీ ఏర్పాటు చేసిన ఐదు పడకల డయాలసిస్ కేంద్రాన్ని సోమవారం ఎమ్మెల్సీ నర్తు రామారావు, ఎమ్మెల్యే బెందాళం అశోక్ ప్రారంభించారు. డయాలసిస్ గదితో పాటు తాగునీటి ఆర్‌ఓ ప్లాంట్, స్టెమీ యూనిట్, అత్యవసర రోగుల యూనిట్, ల్యాబ్‌లను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఉద్దానంలో కిడ్నీ బాధితుల కోసం గత వైఎస్సార్ సీపీ పాలనలోనే రూ.ఏడు వందల కోట్లతో తాగునీటి పథకం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కిడ్నీ వ్యాధి నిర్మూలనకు మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. డీసీహెచ్ కళ్యాణ్ బాబు మాట్లాడుతూ హెచ్‌ఐవీ రోగులకు ఇప్పటి వరకు విశాఖ కేజీహెచ్‌లోనే ప్రత్యేక వైద్యసేవలు అందించే వారని, ఇకపై ఇచ్ఛాపురంలోనూ సేవలు అందిచేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కవిటిలో డయాలసిస్ కోసం 20 బెడ్లు, సోంపేటలో 19 ఉండగా అదనంగా మరో 3 బెడ్లు పెంచినట్లు చెప్పారు. పలాసలో 20 బెడ్లు ఉండగా మరో 10 పెంచినట్లు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ దేవేంద్ర రెడ్డి, దాసరి రాజు, ఎన్.కోటి, వైద్య సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు.