
ఆరేళ్లకే ఆయువు తీరింది
పొందూరు: పొందూరు–చిలకపాలెం రహదారిలోని ఎరుకులపేట కూడలి వద్ద సోమవారం సాయంత్రం ద్విచక్ర వాహనం ఢీకొని ఆరేళ్ల బాలుడు దుర్మరణం చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పొందూరు మండలం గోకర్నపల్లి పంచాయతీ రంగనాథపేట గ్రామానికి చెందిన పేడాడ హరిబాబు, ఈశ్వరమ్మ దంపతులకు వెంకటసూర్య యువంత్(6) అనే కుమారుడు ఉన్నాడు. యువంత్ తల్లిదండ్రులతో కలిసి ఎరుకులపేటలో చిన్న తాతయ్యను చూసేందుకు వచ్చాడు. అక్కడి నుంచి చిలకపాలెం వెళ్లేందుకు తల్లిదండ్రులతో కలిసి ఎరుకులపేట బస్టాప్‌కు బయలుదేరాడు. బస్టాప్ నుంచి రహదారి అవతలవైపు ఆటో ఆపేందుకు తండ్రి హరిబాబు వెళ్లాడు. తండ్రి దగ్గరకు వెళ్లాలనే ఆతృతతో తల్లి ఈశ్వరమ్మ చేయిని వదిలి బాలుడు పరిగెత్తుకుంటూ రోడ్డుపైకి వెళ్లాడు. అదే సమయంలో చిలకపాలెం నుంచి పొందూరు వైపు వస్తున్న ద్విచక్ర వాహనం బాలుడి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలుడిని పొందూరులోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లగా అక్కడ డాక్టర్ లేకపోవడంతో 108 వాహనంతో శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో రిమ్స్‌కు తీసుకెళ్లాలని వైద్యసిబ్బంది సూచించారు. అక్కడికి వెళ్తుండగా మార్గమధ్యలోనే బాలుడు మృతి చెందాడు. తండ్రి హరిబాబు విశాఖపట్నంలోని ప్రైవేటు కళాశాలలో పనిచేస్తున్నారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు. కాగా, బాలుడి మృతితో రంగనాథపేటలో విషాద ఛాయలు అలముకున్నాయి. తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరితరం కాలేదు.
● ద్విచక్ర వాహనం ఢీకొని బాలుడి మృతి
● ఎరుకులపేట వద్ద ఘటన