
రోజుకు రూ.కోటి
టెక్కలితో పోటీ..
● పొందూరు మండలంలో అడ్డగోలుగా
మైనింగ్ దందా
● టెక్కలి నియోజకవర్గంతో పోటీ పడి దోచేస్తున్న పరిస్థితి
● కీలక నేత కనుసన్నల్లో తవ్వకాలు
● ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :
జిల్లాలో మైనింగ్ దోపిడీ యథేచ్ఛగా జరుగుతోంది. అడ్డు చెప్పే వారు లేకపోవడం, అడ్డుకునే వారు రాకపోవడంతో ఓ కీలక నేత ఆధ్వర్యంలో మైనింగ్ దందా విజయవంతంగా సాగుతోంది. ఇప్పటివరకు టెక్కలి నియోజకవర్గంలో మాత్రమే ఈ దందా జరిగేది. ఇప్పుడు ఆమదాలవలస నియోజకవర్గం కూడా అడ్డాగా మారింది. అక్కడెలాగైతే ఓ కీలక నేత కనుసన్నల్లో మైనింగ్ అక్రమాలు జరుగుతున్నాయో ఇక్కడ కూడా ఒక కీలక నేత దందాను నడిపిస్తున్నారు. రోజుకి రూ.కోటికి పైగా అక్రమ మార్గంలో ఆర్జిస్తున్నట్టు సమాచారం. మైనింగ్ దోపిడీలో కొంత అధికారులకు ముడుతుండడంతో చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారు.
ఆమదాలవలస నియోజకవర్గంలో మైనింగ్ అంటే గుర్తుకొచ్చేది పొందూరు మండలమే. ఒక ప్పుడు కొన్ని కుటుంబాల వారు బతుకుతెరువు కోసం రాళ్లు కొట్టుకుని జీవించేవారు. రాను రాను ఆ రాళ్లకు డిమాండ్ పెరగడంతో అక్రమార్కుల కన్ను అక్కడున్న కొండలు, గుట్టలపై పడింది. యంత్రాలు, బ్లాస్టింగ్ ద్వారా తవ్వకాలు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. నియోజకవర్గ కీలక నేత కనుసన్నల్లో ఇక్కడ అక్రమ మైనింగ్ జరుగుతోంది. ఆయనకు రూ.కోట్లలో ముడుపులందగా, క్వారీలు నడు పుతున్న వారు అంతకుమించి సంపాదిస్తున్నారు. అంతా కలిసి విలువైన బ్లాక్ స్టోన్‌ను దోచేస్తున్నారు.
పొందూరు మండలంలో రాపాక, ఇల్లయగారిపేట, గారపేట, పుల్లాజీపేట, లోలుగు, పొందూరు తదితర ప్రాంతాలు అక్రమ మైనింగ్ కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాయి. పొందూరు మండలంలోని సర్వే నంబర్లు 335, 244, 223, 198, 71లతో పాటు మరికొన్ని సర్వే నంబర్లలో వేల హెక్టార్లలో అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారు. కృష్ణాపురం సమీపంలోని సర్వే నంబర్ 335లో అత్యధికంగా అక్రమ మైనింగ్ జరుగుతోంది. కీలక నేత ఆధ్వర్యంలో కె.రమేష్, కె.రామినాయుడు, కె.అప్పారావు, జి.రమణ, వి.రామారావు, కె.గౌరీనాయుడు, కె.అక్కలనాయుడు, కె.శశి, పి.రమణ, కె.అప్పలనాయుడు, పి.రమణమూర్తితో మరో 20మంది వరకు అక్రమ క్వారీలు నిర్వహిస్తున్నారు. ఒకప్పుడు రెండు, మూడు క్వారీలకు పరిమితమై నడవగా ఇప్పుడవి 26కు పైగా నడుస్తున్నాయి. వీటిలో ఐదు క్వారీలకు మాత్రమే లీజు అనుమతులు ఉన్నాయి. మిగతా 21 క్వారీలకు అనుమతుల్లేవు. ఇక లీజు అనుమతులు ఉన్న క్వారీల్లో కూడా పరిమితికి మించి తవ్వకాలు జరిపి సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్క క్వారీలే కాదు 25వరకు అక్రమ క్రషర్లు కూడా నడుస్తున్నాయి.
గత ఐదేళ్లు అక్రమాలకు చెక్
వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు అక్రమాలకు చెక్ పడింది. విశ్వసముద్ర కంపెనీకి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించడంతో ప్రభుత్వానికి భారీ గా ఆదాయం రావడంతో అక్రమ క్వారీలకు అవకాశం ఉండేది కాదు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక కొన్నాళ్లు విచ్చలవిడిగా అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారు. ఆ తర్వాత విశ్వసముద్రకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. ఎక్కడ చెడిందో గానీ విశ్వసముద్రను తప్పించి ఏఎంఆర్ సంస్థకు అప్పగించారు. అయితే, ఈ సంస్థతో కూడా లోపాయికారీ ఒప్పందాలు అమల్లోకి రాకపోవడమో, అడిగినంత ఇవ్వలేదనో గానీ ఏఎంఆర్ సంస్థను కూడా హోల్డ్‌లో పెట్టేశారు. దీంతో ఎవరికి నచ్చినంత వారు దోచే స్తున్నారు. ప్రస్తుతం ఇసుక, మట్టి, గ్రావెల్‌తో పాటు మైనింగ్ కూడా తెలుగు తమ్ముళ్లకు కనకవర్షం కురిపిస్తోంది. విశేషమేమిటంటే, ఇటీవల పోలీసు, రెవెన్యూ అధికారులు తనిఖీలకు వెళ్లినాక కూడా అక్కడ అక్రమ మైనింగ్ ఆగలేదు.

రోజుకు రూ.కోటి

రోజుకు రూ.కోటి

రోజుకు రూ.కోటి

రోజుకు రూ.కోటి