
3 సెంట్ల స్థలం.. 200 మంది జనాలు
రణస్థలం: భూ వివాదం నేపథ్యంలో రణస్థలం టీడీపీ నాయకులు బల ప్రదర్శనకు దిగారు. భారీగా మద్దతుదారులను తీసుకొచ్చి తోపులాటకు దిగారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించినందుకు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జె.ఆర్.పురం పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల.. టీడీపీ నాయకుడు, కృష్ణపురం మాజీ ఎంపీటీసీ సభ్యుడు ముల్లు కృష్ణ, మాజీ ఎంపీపీ డీజీఎం ఆనందరావు మధ్య కొన్నాళ్లుగా 3సెంట్ల భూమి విషయమై వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో వారం కింద కృష్ణ తాను కొనుగోలు చేసిన 3సెంట్ల స్థలాన్ని చదును చేస్తుండగా ఆనందరావు వర్గీయులు అడ్డుకున్నారు. స్థలం సర్వ హక్కులు తమకే ఉన్నాయని గొడవ పడ్డారు. ఈ వివాదంపై ఇరువురు జె.ఆర్.పురం పోలీస్ స్టేషన్‌ల్లో ఫిర్యాదులు చేసుకున్నారు. తాజాగా ఆదివారం కృష్ణ తన అనుచరులతో మరోసారి స్థలం బాగు చేస్తుండగా ఆనందరావు వర్గీయులు వచ్చి అడ్డుకున్నారు. ఇరువర్గాలకు చెందిన సుమారు 200 మంది జనం చేరడంతో తోపులాటకు దారితీసింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఇరువర్గాలకు సర్దిచెప్పినా వినలేదు. ఎస్సై చిరంజీవి మరికొంత మంది సిబ్బందితో వచ్చి ఇరువర్గాలను చెదరగొట్టారు. మూడు సెంట్ల స్థలం కోసం ఇంత రభస చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడి నుంచి వెళ్లకపోతే కేసులు నమోదు చేస్తానని హెచ్చరించారు.
పత్రాలు పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు రావాలని ఇరువర్గాలకు చెప్పి పంపించేశారు. అనంతరం ఎస్‌ఐ మాట్లాడుతూ రెవెన్యూ అంశం కావడం వల్ల తహసీల్దార్‌కు అప్పగించామని చెప్పారు. ఎటువంటి గొడవలు పడకుండా ఇరువర్గాలపై బైండోవర్ నమోదు చేస్తున్నామని తెలిపారు.
బల ప్రదర్శనకు దిగిన టీడీపీ నాయకులు
రంగంలోకి దిగిన పోలీసులు
శాంతిభద్రతలకు విఘాతంపై ఎస్సై ఆగ్రహం