
వైఎస్సార్ సీపీ కల.. ఫలిస్తున్న వేళ
● ఇచ్ఛాపురంలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం నేడు
● ఎన్నికల ముందే నిర్మాణం పూర్తి
● ఎట్టకేలకు ప్రారంభిస్తున్న కొత్త ప్రభుత్వం
ఇచ్ఛాపురం టౌన్ : ఇచ్ఛాపురం పట్టణంలోని ప్రభుత్వ సామాజిక ఆస్పత్రి ఆవరణలో కిడ్నీ రోగుల కోసం వైఎస్సార్ సీపీ ప్రభుత్వం హ యాంలో నిర్మించిన డయాలసిస్ కేంద్రాన్ని ఎట్టకేలకు సోమవారం ప్రారంభించనున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందే డ యాలసిస్ కేంద్రం కోసం అనుమతులు తెచ్చింది. అవసరమైన ఏర్పాట్లన్నీ చేసింది. ఐదు డయా లసిస్ యంత్రాల ద్వారా రోగులకు సేవలు అందించేందుకు సకలం సిద్ధం చేసింది. ఇంతలో ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో డయాలసిస్ కేంద్రం ప్రారంభం ఆగిపోయింది. సర్వం సిద్ధంగా ఉన్నా కేంద్రం ప్రారంభించడానికి ఏడాది పాటు మీనమేషాలు లెక్కించిన కూటమి ప్రభుత్వం ఎట్టకేలకు ప్రారంభానికి పచ్చజెండా ఊపింది. ఈ కేంద్రం ప్రారంభించలేదని ‘సాక్షి’ లో పలుమార్లు కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ నెల 10వ తేదీన కూడా ‘పాలకులకు పట్టని డయాలసిస్ కేంద్రం’ శీర్షికన వార్త ప్రచురితమైంది. దీంతో అధికారులు, పాలకులు స్పందించి బెడ్లు, ఇతర యంత్రాలు శుభ్రపరిచి ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో డయాలసిస్ కేంద్రాన్ని సీడాప్ మాజీ చైర్మన్ సాడి శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఆదివారం పరిశీలించారు. కావాల్సిన సిబ్బందిని నియమించాలని, విద్యుత్ అంతరాయాలు కలగకుండా చూసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నీటి నాణ్యత పరీక్షకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఆయనతో పాటు వైఎస్సార్‌సీపీ నాయకుడు పిలక విజయ్ పాల్గొన్నారు.
డయాలసిస్ కేంద్రం

వైఎస్సార్ సీపీ కల.. ఫలిస్తున్న వేళ