
ఈఓ.. రూ.10 ఇవ్వు!
అరసవల్లి: ప్రత్యక్ష దైవం అరసవల్లి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. అయితే పలు విభాగాల్లో నిర్ణీత రుసుం కంటే అదనంగా వసూలు చేస్తున్న ఆలయ సిబ్బందిపై ఆల య ఈఓ శోభారాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఉచితంగా మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాల్సి ఉండగా.. అక్కడ కూడా భక్తుల నుంచి అదనంగా రూ.10 వరకు వసూళ్లు చేస్తున్న వైనంపై ఆమె మండిపడ్డారు. ఆమె స్వయంగా మరుగుదొడ్లకు వెళ్లగా.. ఆమె ఈఓ అని తెలియక అక్కడున్న ఓ సిబ్బంది రూ.10 ఇవ్వాల్సిందేనని అడిగారు. దీంతో ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆ సిబ్బందిని విధుల నుంచి తప్పించి వేరే సిబ్బందిని నియమించేలా ఈఓ చర్యలు చేపట్టారు. అలాగే కొబ్బరికాయ కొట్టడానికి భక్తుల నుంచి రూ.10, క్లాక్ రూంలో సెల్‌ఫోన్ భద్రపరచడానికి అదనంగా రూ.5, బ్యాగులకు అదనంగా రూ.10, కొందరు సెక్యూరిటీ సిబ్బంది, కొందరు ఆలయ దినసరి వేతనదారులు భక్తుల నుంచి రూ.500 వరకు డబ్బులు వసూలు చేస్తూ దర్శనాలకు పంపిస్తున్నారని, కేశఖండన శాలలో తలనీలాల మొక్కులు చెల్లించడానికి అదనంగా రూ.50 వరకు వసూలు చేస్తున్నారని ఈఓ గుర్తించారు. వచ్చే ఆదివారం ఈ విభాగాలపై ప్రత్యేక విజిలెన్స్ ఏర్పాటు చేయనున్నట్లుగా ఆమె ప్రకటించారు.
అదనపు వసూళ్లపై ఈఓ ఆగ్రహం..
ఆదిత్యునికి వివిధ దర్శనాల టిక్కెట్ల ద్వారా దర్శనాలకు ఏర్పాటు చేసినప్పటికీ కొందరు నకిలీ సిఫారసులతో ఎగ్జిట్ మార్గం నుంచి పెద్ద సంఖ్య లో దర్శనాలకు వెళ్లారు. అక్కడి సిబ్బంది కూడా తమకు నచ్చినట్లుగా దర్శనాలకు పంపించినట్లుగా ఈఓ దృష్టికి వెళ్లడంతో ఆమె అక్కడి సెక్యూరిటీతో పాటు విధుల్లో ఉన్న దేవదాయ శాఖ సిబ్బందిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.
అరసవల్లిలో ఈఓ అని తెలియక
పది రూపాయలు అడిగిన సిబ్బంది
అదనపు వసూళ్లపై
మండిపడిన అధికారి

ఈఓ.. రూ.10 ఇవ్వు!