
జిల్లాకు పిడుగుపాటు హెచ్చరిక
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో నేటి నుంచి 23వ తేదీ వరకు అక్కడక్కడా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, 21, 22, 23 తేదీల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పిడుగులు పడే ప్రమాదం ఉండటంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సూచించారు. వానల సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని, చెట్ల కింద, విద్యుత్ స్తంభాల దగ్గర నిలవకూడదని, మొబైల్ ఫోన్లు, హెడ్‌ఫోన్లు వాడకూడదని, ఇంట్లో ఉన్న పిల్లలు, వృద్ధులు బయ టకు వెళ్లకుండా చూడాలని, పశువులను కప్పుతో కూడిన షెడ్లలో ఉంచాలని, టీవీ, ఫ్రిజ్, మోటార్లు వంటి విద్యుత్ పరికరాలను స్విచ్ ఆఫ్ చేయాలని, నీటి మోటార్లను నడపరాదని పేర్కొన్నారు. అలాగే గాలివానల వేళ పంట పొలాల్లోకి వెళ్లకూడదని, బైకులు, ఆటోలు నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని, ఎలక్ట్రానిక్ పరికరాలను వాడకూడదని, పుకార్లను నమ్మకూడదని అధికారిక సమాచారాన్ని మాత్రమే అను సరించాలని తెలిపారు. విపత్తుల సమయంలో జిల్లా విపత్తు నిర్వహణ కేంద్రం 24 గంటల పాటు పనిచేస్తుందని కలెక్టర్ తెలిపారు.
40–50 కిలోమీటర్ల వేగంతో గాలులు, ఉరుములతో వర్షాలు
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్