
పడేస్తారా?
మృతదేహాలను ముద్దల్లా
● ఆందోళనకు దిగిన క్వారీ ఘటన
బాధిత కుటుంబ సభ్యులు
● పోస్టుమార్టానికి తరలించకుండా నిరసన
● న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన కలెక్టర్, ఎస్పీ
మెళియాపుట్టి :
దబ్బగూడ కొండపై క్వారీ (మౌనీస్ కూనపు రెడ్డి)లో శుక్రవారం జరిగిన ఘటన పిడుగు పాటు కాదని, పేలుడు వల్లే తమవారు మృతి చెందారంటూ బాధిత కుటుంబసభ్యులు శనివారం ఆందోళన వ్యక్తం చేశారు. సాయంత్రం మూడు గంటల వరకు మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించడానికి నిరాకరించారు. తమకు న్యాయం చేయాల్సిందేనని పట్టుబట్టారు. మృతదేహాలను ఘటనా స్థలం నుంచి నిమిషాల వ్యవధిలో తరలించడం వెనుక కుట్ర ఉందనీ, కొన్ని శరీరభాగాలను కొండ మీదనే విడిచిపెట్టి, మిగతా శరీర భాగాలను కిందకు తీసుకురావడంపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ మేరకు మృతులు అప్పన్న, రాము, ఆర్ముగంల భార్యాపిల్లలు, ఇతర కుటుంబసభ్యులు శనివారం క్వారీ వద్ద ఆందోళనకు దిగారు.
ఈ సందర్భంగా రాము కుమారుడు షణ్ముఖరావు మాట్లాడుతూ మృతదేహాలను బొలెరో వాహనంలో ముద్దగా పడేశారని, ఇటువంటి దుశ్చర్యకు పాల్పడటం తగదన్నారు. ఆర్ముగం భార్య జయంతి మాట్లాడుతూ కుటుంబానికి పెద్దదిక్కును కోల్పోయామని, ఎలా బతకాలంటూ విలపించారు. కనీసం మానవతా దృక్పథం లేకుండా మృతదేహాలను బొలెరోలో పడేశారనీ, తమకు తెలియకుండా గొయ్యితీసి పాతేసే ప్రయత్నం జరిగిందని ఆరోపించారు.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ..
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ మహేశ్వర రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధిత కుటుంబాలతో మాట్లాడారు. పిడుగుపాటుతో బ్లాస్టింగ్ జరిగినట్లు ప్రాథమిక అంచనా వేస్తున్నామని, ఘటనా స్థలంలో మృతదేహాలు ఉంచకుండా తరలించడం సరైన చర్యకాదని, దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. పూర్తి వివరాలు సేకరించి క్వారీ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామన్నారు. సాయంపై మంత్రి అచ్చెన్నాయుడుతో మాట్లాడతానని చెప్పా రు. న్యాయం చేసేందుకు పూర్తి బాధ్యత తనదేనని కలెక్టర్ హామీ ఇచ్చారు. దీంతో మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించేందుకు కుటుంబసభ్యులు అంగీకరించారు. అనంతరం టెక్కలి జిల్లా ఆస్పత్రికి పోస్టుమార్టానికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పాతపట్నం సీఐ రామారావు తెలిపారు. అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు, టెక్కలి ఆర్డీవో కృష్ణమూర్తి, మైన్స్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

పడేస్తారా?