
హైవేపై హాహాకారాలు
● లారీని ఢీకొట్టిన టూరిస్ట్ బస్సు ● విశాఖకు చెందిన ఏడుగురు యాత్రికులకు గాయాలు ● అదే సమయంలో ప్రమాదానికి గురైన మరో లారీ ● క్యాబిన్‌లో చిక్కుకుని డ్రైవర్ దుర్మరణం
శ్రీకాకుళం రూరల్:
జాతీయ రహదారిపై శనివారం వేకువజామున హాహాకారాలు మిన్నంటాయి. ఏం జరుగుతుందో తెలియక ప్రయాణికులు, అటువైపుగా వెళ్తున్న వాహనచోదకులు భీతిల్లిపోయారు. తొలుత టూరిస్ట్ బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టగా.. కొద్దిసేపటి తర్వాత అదేచోట ఆగి ఉన్న లారీలను మరో గ్రానైట్ లారీ ఢీకొట్టింది. నిమిషాల వ్యవధిలో జరిగిన ఈ ఘటనల్లో ఓ డ్రైవర్ మృతి చెందగా, ఏడుగురు యాత్రికులు గాయపడ్డారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
శ్రీకాకుళం రూరల్ మండల పరిధిలోని సింగుపురం కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయం సమీపంలో శనివారం వేకువజామున సుమారు ఐదు గంటల ప్రాంతంలో విశాఖపట్నం నుంచి బరంపురం వెళుతున్న కంభమేశ్వరి ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఎదురుగా వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఆ సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉండగా.. ప్రమాదం ధాటికి ఏడుగురు ప్రయాణికులు బస్సులోనే గాయపడ్డారు. డ్రైవర్ నిద్రమత్తే ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది. విషయం తెలుసుకున్న రూరల్ పోలీసు లు అప్రమత్తమై హైవే అంబులెన్స్‌కు సమాచా రం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది బస్సులో నుంచి క్షతగాత్రులను బయటకు తీశారు. ఆ సమయంలో ట్రాఫిక్ స్తంభించింది. ఇదే రహదారిలో వరుసగా నాలుగు లారీలు నిలిచిపోయాయి. ఆ సమయంలో విశాఖ వైపు నుంచి కోటబొమ్మాళికి గ్రానైట్ రాళ్లతో వస్తున్న లారీ.. ముందు ఆగి ఉన్న లారీలను గమనించక అతివేగంతో ఢీకొట్టింది. ఈ ఘటనలో గ్రానైట్ రాళ్లు క్యాబిన్ వైపునకు దూసుకురావడంతో అందులో చిక్కుకుని లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిని విశాఖ జిల్లా సబ్బవరం గ్రామానికి చెందిన రాపర్తి నూకరాజు(38)గా గుర్తించారు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రమాద సమయంలో లారీలు ఒకదానితో ఒకటి కలిసిపోవడంతో అతి కష్టమ్మీద మృతుడిని బయటకు తీశారు. టౌన్ సీఐ పైడపునాయుడు, రూరల్ ఎస్సై రాము ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను చక్కదిద్దారు.
నుజ్జయిన
గ్రానైట్
లారీ ముందుభాగం

హైవేపై హాహాకారాలు

హైవేపై హాహాకారాలు