
ప్రాజెక్టుల పనుల్లో పురోగతి ఏదీ?
హిరమండలం: వంశధార ప్రాజెక్టుల విషయంలో వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి చిత్తశుద్ధితో పనిచేయగా.. కూటమి ప్రభుత్వం ప్రచార ఆర్భాటానికే పరిమితమైందని వైఎస్సార్‌సీపీ క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు, మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ధ్వజమెత్తారు. శనివారం హిరమండలంలో వంశధార ఫేజ్–2 రిజర్వాయర్‌తో పాటు ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వంశధార రిజర్వాయర్ నిర్మాణానికి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. అనంతరం టీడీపీ ప్రభు త్వం నిర్వాసితులకు అన్యాయం చేసిందన్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాకే అదనపు సాయం అందిందని గుర్తుచేశారు. దాదాపు 97 శాతం పనులు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పూర్తిచేసిందని.. తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం ఏడాది కావస్తున్నా మిగిలిన మూడు శాతం పనులు పూర్తిచేయకుండా తాత్సారం చేస్తోందని దుయ్యబట్టారు. వంశధార ఫేజ్–2 రిజర్వాయర్‌కు కీలకమైన ఎత్తిపోతల పథకంపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. 2022 సెప్టెంబరు 14న అప్పటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి గొట్టా బ్యారేజీలో ఎత్తిపోతల పథకం నిర్మాణానికిగాను రూ.176.35 కోట్లు మంజూరు చేశారని, ఏడాది కాలంలోనే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 33 శాతం పనులు పూర్తిచేసిందని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏడాదిలో 7 శాతం పనులు మాత్రమే పూర్తిచేసిందన్నారు. జిల్లాలో వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నా రైతాంగ సమస్యలు పరిష్కరించడంలో విఫలమయ్యారని దుయ్యబట్టారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ మీసాల వెంకట రామకృష్ణ, నాయకు లు లోలుగు లక్ష్మణరావు, వి.చిన్నారావు, వి.చిరంజీవి, ఎం.రామారావు, ఎల్.ప్రసాద్, ఎం.శ్రీనివాసరావు, బి.మురళి, వి.బాలరాజు, ఎన్. ఆనందరావు, మామిడి గంగాధరరావు తదితరులు పాల్గొన్నారు.
కూటమి ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఆగ్రహం