
రైతు ఆత్మహత్యలపై చర్యలేవీ..?
కంచిలి: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సొంత జిల్లాలో ఆత్మహత్యలపై ప్రభుత్వ చర్యలు లేకపోవడంపై తెలుగు రాష్ట్రాల మానవ హక్కుల వేదిక సంయుక్త కార్యదర్శి వీఎస్ కృష్ణ ప్రశ్నించారు. మానవ హక్కుల వేదిక, రైతు స్వరాజ్య వేదిక ఆధ్వర్యంలో కంచిలి మండలంలోని పెద్దకొజ్జిరియా గ్రామంలో శుక్రవారం పర్యటించారు. అనంతరం కంచిలిలో విలేకరులతో మాట్లాడారు. ఈ గ్రామానికి చెందిన కౌలు రైతు బల్లెడ నర్సింహమూర్తి ఏప్రిల్ 9వ తేదీన ఆత్మహత్య చేసుకున్నాడని, పంట కోసం చేసిన అప్పులు తీర్చలేకనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని వారు తెలిపారు. ఇతనికి ఇంత వరకు ప్రభుత్వం నుంచి ప్రభుత్వ సాయం అందలేదని, కనీసం రెవెన్యూ డివిజన్ స్థాయి అధికారులతో త్రిసభ్య కమిటీతో విచారణ కూడా చేపట్టలేదని వెల్లడించారు. ఇలాంటి ఆత్మహత్యలు జరిగితే ఆర్డీఓ, డీఎస్పీ, వ్యవసాయశాఖ ఏడీలు విచారణ చేపట్టి, కలెక్టర్‌కు నివేదిక పంపిస్తే, అక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తే వారం రోజుల్లో రూ.7లక్షలు పరిహారాన్ని మృతుని కుటుంబానికి ఇవ్వాలని జీఓ ఉందని కృష్ణ గుర్తు చేశారు. వ్యవసాయ మంత్రి జిల్లాలోనే రైతు ఆత్మహత్యలపై ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమన్నారు. జిల్లాలో గత తొమ్మిదేళ్లలో 17 ఆత్మహత్యలు జరిగాయని, కవిటి, కంచిలి, నందిగాం, పలాస ప్రాంతాల్లో నాలుగు ఆత్మహత్యలు జరిగాయని రాష్ట్ర రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర కో–కన్వీనర్ బాలు అన్నారు. పెద్దకొజ్జిరియా కౌలు రైతు, మృతుడు బల్లెడ నర్సింహమూర్తి 12 ఎకరాలు వరకు జీడిమామిడి కౌలుకు తీసుకొని నష్టపోయి ఆత్మహత్యకు పాల్పడ్డాడని అన్నారు. కొత్త ప్రభుత్వం ఆత్మహత్య కేసులను పట్టించుకోవడం లేదన్నారు.
ఉద్దానంలో కిడ్నీ మరణాలతో రైతుల ఆత్మహత్యలు పెరుగుతుండడం బాధాకరమన్నారు. పంటలను వేధిస్తున్న తెల్లదోమ నివారణకు కూడా యంత్రాంగం చర్యలు తీసుకోలేదన్నారు. అన్నదాత సుఖీభవ ప్రస్తావన కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విచారణలో మానవ హక్కుల వేదిక విశాఖపట్నం జిల్లా ప్రతినిఽధి కె.అనురాధ, మానవహక్కుల వేదిక అధ్యక్షుడు కేవీ జగన్నాథరావు, బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి బీన ఢిల్లీరావు, మరో నేత తామాడ అరుణ తదితరులు పాల్గొన్నారు.
మానవ హక్కుల వేదిక రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వీఎస్ కృష్ణ