
పేకాట శిబిరంపై దాడి
రణస్థలం: మండలంలోని కొచ్చెర్ల పంచాయతీ కొమరవానిపేట సమీప తోటల్లో శుక్రవారం పేకాట ఆడుతున్న ఏడుగురిని జె.ఆర్.పురం పోలీసులు పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి రూ.12,400 నగదు, ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జె.ఆర్.పురం ఎస్సై ఎస్.చిరంజీవి తెలిపారు.
బాణసంచా దుకాణంలో చోరీ
ఎచ్చెర్ల క్యాంపస్: మండలంలోని ఇబ్రహింబాద్ పంచాయతీ పరిధిలో కింతలి రోడ్డులో ఉన్న ధనలక్ష్మి ఎంటర్‌ప్రైజెస్ (మందుగుండు సామగ్రి దుకాణం)లో గురువారం అర్థరాత్రి చోరీ జరిగింది. ఈ ఘటన సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైంది. ఓ వ్యక్తి క్యాష్ కౌంటర్‌లో ప్రవేశించి తాళాలు పగల కొట్టి లాకర్‌లోని నగదు చోరీ చేశాడు. రూ.10 వేలు వరకు నగదు ఉంటుందని యజమానులు చెబుతున్నారు. శుక్రవారం ఉదయం షాపు వద్దకు వచ్చేసరికి చోరీ జరిగినట్లు గుర్తించడంతో యజమాని వావిలపల్లి శ్యామలరావు ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీసీ కెమేరా ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
100 లీటర్ల నాటుసారా స్వాధీనం
సోంపేట: సోంపేట ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో శుక్రవారం 100 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఇన్‌చార్జి సీఐ జీవీ రమణ తెలిపారు. మండలంలోని బకుడ గ్రామంలో సవర లక్ష్మి వద్ద 70 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకుని అదుపులోకి తీసుకున్నారు. ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలోని రాగుపురం గ్రామంలో 30 లీటర్ల నాటు సారాతో నర్తు హేమరాజును అదుపులోకి తీసుకున్నారు. దాడుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ సుజాత సిబ్బంది పాల్గొన్నారు.