
బీసీ రుణాలకు మోక్షమెప్పుడో?
శ్రీకాకుళం పాతబస్టాండ్:
వెనుకబడిన తరగతుల్లో నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఉద్దేశించిన బీసీ కార్పొరేషన్ సబ్సిడీ రుణాలు అందని ద్రాక్షలా మారాయి. కేవలం కూటమి ప్రభుత్వం కార్యకర్తలకు వరంగా మార్చుకుంటున్నారు తప్ప ఎక్కడా పారదర్శకత పాటించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంటర్వ్యూలు, దరఖాస్తుల ప్రక్రియ అంతా తూతూమంత్రంగానే ఉందని అర్హులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అంతా రాజకీయ జోక్యమే..
దరఖాస్తుల ప్రక్రియ మొదలైన నాటి నుంచి రుణాల పంపిణీపై రాజకీయ జోక్యం పెరిగిపోవడంతో అర్హతలు ఉన్న సామాన్యులు ఆశలు వదులుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఎన్నికలకు ముందు ఇబ్బడిముబ్బడిగా హామీలను గుప్పించి అధికారం చేజిక్కించుకున్న కూటమి ప్రభుత్వం ఎనిమిది నెలల పదవీ కాలంలో పింఛన్ల పెంపు పథకాన్ని తప్ప మరే ఇతర పథకాన్ని అమలు చేసిన దాఖలాలు లేవు. హామీలను నెరవేర్చలేమంటూ కూటమి ప్రభుత్వం చేతులెత్తేస్తున్న తరుణంలో ప్రజలు తీవ్ర అసంతప్తితో రగిలిపోతున్నారు. ఈ క్రమంలో బీసీ రుణాలను మంజూరుకు కూటమి ప్రభుత్వ పెద్దలు శ్రీకారం చుట్టారు. ఈ రుణాలు కూడా అందరికి అందుబాటులో లేని పరిస్థితులు ఉన్నాయి. యూనిట్లు తక్కువగా ఉండటంతో దరఖాస్తుదారులు ఎక్కువగా ఉండటంతో లబ్ధిదారుల ఎంపికలో గందరగోళం నెలకొంది. బ్యాంకు, ఇతర అధికారులతో పనిలేకుండా నేరుగా నియోజకవర్గాల శాసన సభ్యులు సిపారసు లేఖలే ప్రామాణికంగా ఎంపికలు జరగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
బీసీలకు బాసట కరువు..
జిల్లాలో ఎక్కువగా బీసీ సామాజికవర్గాల వారే ఉన్నారు. ఆ వర్గానికి ఆర్థిక వనరులు అంతంత మాత్రంగానే ఉండటంతో నిరుద్యోగ యువకులు ఉద్యోగ అవకాశాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాకు ఎక్కువ యూనిట్లు మంజూరి చేయాల్సి ఉంది. అయితే ఆ దిశగా ప్రభుత్వం దృష్టి సారించలేదు. బీసీ జనాభాను ప్రాతిపదికగా తీసుకుంటే బీసీలకు మరిన్ని యూనిట్లు వచ్చి మేలు జరిగే అవకాశం ఉండేది. పేద జిల్లా అయినందున స్వయం ఉపాధిని పొందేందుకు బీసీ రుణాల కోసం అఽధిక సంఖ్యలో యువత ముందుకు వస్తున్నా ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఫలితం లేకుండాపో తోంది.
ఇంటర్వ్యూలు పూర్తయినా..
బీసీ రుణాల కోసం జిల్లా వ్యాప్తంగా ఇంటర్వ్యూలు పూర్తయ్యాయి. అయితే ఇంటర్వ్యూలు పూర్తి చేసుకున్న వారికి అప్‌డేట్ మాత్రం ఇవ్వడం లేదు. ఎంపీడీవోలు తరువాత మీకు సమాచారం పంపుతామని చెప్పి పంపించేస్తున్నారు. ఎంపిక జాబితాలను మాత్రం వెల్లడించడం లేదు.
బ్యాంకర్లకు తలనొప్పులు..
లబ్ధిదారుల ఎంపికలో బ్యాంకులు కీలక భూమిక పోషించాల్సి ఉంది. లబ్ధిదారులకు 50 శాతం సబ్సిడీ ప్రభుత్వం ఇవ్వగా, మిగిలిన 50 శాతం రుణం బ్యాంకు వారు అందజేయాలి. అయితే బ్యాంకు అనుమతి లేకుండా కూటమి నాయకులు లబ్ధిదారుల పేర్లను సిఫారసులు చేస్తున్నారు. వీరిలో ఎక్కువ మందికి రుణం పొందేందుకు కావాల్సిన ‘సిబిల్’ స్కోర్ అనుకూలంగా లేనందున బ్యాంకర్లు రుణం ఇచ్చేందుకు సుముఖత చూపడం లేదు. ఈ సమయంలో నాయకులు బ్యాంకులపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ పరిస్థితి బ్యాంకర్లకు తలనొప్పిగా మారింది.
లక్ష్యం 3133 యూనిట్లు.. దరఖాస్తులు 22,822
తూతూమంత్రంగా మండల స్థాయి ఇంటర్వ్యూలు
బ్యాంకర్లపై కూటమి నేతల ఒత్తిడి!