
ఉద్దాన విధ్వంసాన్ని సహించేది లేదు
వజ్రపుకొత్తూరు రూరల్: ప్రజల ఆస్తులను కార్పోరేట్ కంపెనీలకు కట్టబెట్టి పచ్చని ఉద్దాన ప్రాంతంలో విధ్వంసానికి పాల్పడితే సహించేది లేదని ప్రజా సంఘాల నాయకులు హెచ్చరించారు. ఈ మేరకు వజ్రపుకొత్తూరు మండలం ఒంకులూరులో బుధవారం కార్గో ఎయిర్‌పోర్టు వ్యతిరేక కమిటీ ఆధ్వర్యంలో కళాజాత నిర్వహించారు. ఈ సందర్భంగా ఆకుపచ్చ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, సీపీఐ ఎంఎల్ న్యూ డెమొక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్, కార్గో ఎయిర్‌పోర్టు పోరాట కమిటీ అధ్యక్షుడు కొమర వాసు మాట్లాడుతూ అభివృద్ధి పేరుతో ప్రజల భూములను బలవంతంగా లాక్కొని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టి ప్రజలను నిరాశ్రయులుగా చేయడం సరికాదన్నారు. ఉద్దాన ప్రాంతంలో కొబ్బరి, జీడిపంటలను నమ్ముకొని వేలాది మంది ప్రజలు జీవనోపాధి సాగిస్తున్నారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల మేలును ఆకాంక్షిస్తే వెంటనే కార్గో ఎయిర్‌పోర్గ్ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. ఉద్దాన ప్రజలకు మేలు కలిగించే ఉద్దాన పంటల ఆధారిత పరిశ్రమలను ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని కోరారు. నాయకులు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనుకుంటే ముందుగా ఏళ్ల తరబడి అభివృద్ధికి నోచుకొని ఆఫ్‌షోర్ రిజర్వాయర్ పనులు పూర్తి చేసి ప్రజలకు తాగునీరు, శివారు భూములకు సాగునీరు అందించే పనులపై దృష్టిపెట్టాలన్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు మౌనం వీడి ఉద్దాన ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జీడి రైతు పోరాట కమిటీ అధ్యక్షుడు తెప్పల అజయ్‌కుమార్, రైతు సంఘ జిల్లా కార్యదర్శి కోనారి మోహన్‌రావు, సీపీఐఎంఎల్ న్యూడెమొక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యులు వంకల మాధవరావు, సీఐటీయూ నాయకులు ఎన్.గణపతి, కార్గో ఎయిర్‌పోర్టు వ్యతిరేక కమిటీ నాయకులు కుసుమ, దానేష్, చలపతి, పి.అరుణ, ధర్మారావు, జోగి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.