
భూముల సమస్యలపై ప్రత్యేక దృష్టి
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): రెవెన్యూ భూముల సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. రెవెన్యూ భూ సమస్యలు, ఎలినేషన్స్, మ్యుటేషన్లపై జిల్లా అధికారులు, తహసీల్దార్లతో జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్‌తో కలిసి బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తీరప్రాంత తహసీల్దార్లు సీఆర్‌జెడ్ రూల్స్‌పై తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలన్నారు. జెడ్పీ సీఈవో ఎల్.ఎన్.వి.శ్రీధర్‌రాజా మాట్లాడు తూ డీఎల్‌డీఓ కార్యాలయానికి రెండు ఎకరాలు అవసరమని చెప్పగా ఆర్డీఓ సాయి ప్రత్యూష స్పందిస్తూ కలెక్టరేట్ నుంచి ప్రతిపాదనలు రావాల్సి ఉందని చెప్పారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు, డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, ఆర్డీఓలు కె.సాయి ప్రత్యూష, కృష్ణమూర్తి, వెంకటేష్, పీడీ బి.శాంతిశ్రీ, సెరీకల్చర్ ఏడీ రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.