
ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
● ఆర్టీసీ ఎన్‌ఎంయూ నాయకుల డిమాండ్
శ్రీకాకుళం అర్బన్: ఏపీఎస్ ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను యాజమాన్యం తక్షణమే పరిష్కరించాలని ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కేవీఆర్ నర్సింగరావు, జిల్లా అధ్యక్షుడు పీఆర్‌కే రావు, జిల్లా కార్యదర్శి వై.అప్పయ్యలు కోరారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎన్‌ఎంయూ ఆధ్వర్యంలో శ్రీకాకుళంలోని డీపీటీవో కార్యాలయ ముట్టడి కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగులకు తక్షణమే 1/2019 సర్క్యూలర్‌ను అమలు చేయాలని, ఆర్టీసీ ఉద్యోగుల అక్రమ సస్పెన్షన్లు, అక్రమ రిమూవల్స్‌ను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. గత నాలుగేళ్లుగా ఆగిపోయిన ప్రమోషన్స్ వెంటనే ఇవ్వాలన్నారు. మహిళా ఉద్యోగులకు ప్రభుత్వ జీవో ప్రకారం పిల్లల సంరక్షణ సెలవులు వెంటనే మంజూరు చేయాలని, నాన్ ఆపరేషన్ ఉద్యోగుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ఈహెచ్‌ఎస్ స్థానంలో పాత వైద్య విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వమే కొనుగోలు చేయాలి
ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వం ద్వారా లేదా సంస్థ ద్వారా మాత్రమే కొనాలని, 114 జీవోలో పొందుపరిచిన మేరకు నైట్ అవుట్ అలవెన్స్‌లను రూ.150ల నుంచి రూ.400ల వరకు చెల్లింపులు చేయాలని, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంస్థపరంగా వేతనాలు చెల్లించాలని విన్నవించారు. ఏపీఎస్ ఆర్టీసీలో ఉన్న విధంగానే క్యాడర్‌ను బలోపేతం చేయాలని, తీవ్రమైన అనారోగ్య కారణాలతో బాధపడుతున్న ఉద్యోగులకు ఓడీలను కేటాయించాలన్నారు. డిప్యూటేషన్లను యథావిధిగా కొనసాగించాలని, పారదర్శకమైన ట్రాన్స్‌ఫర్ పాలసీని అమలు చేయాలని కోరారు. ఆఫీసు సిబ్బంది దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని, రిటైర్ ఉద్యోగుల దంపతులకు సూపర్ లగ్జరీ బస్సులో ప్రయాణాలను అనుమతించాలని, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని, ఆన్ కాల్ డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లాలోని శ్రీకాకుళం ఒకటి, రెండు డిపోలతో పాటు టెక్కలి, పాలకొండ తదితర డిపోల నుంచి ఎన్‌ఎంయూ నాయకులు ఎంఎన్ రావు, పి.నవీన్‌బాబు, ఎంఆర్ మూర్తి, కె.నర్సింహులు, పి.వాసు, హెచ్‌వీ మూర్తి, జేఆర్ రావు, వీడీరావు, వీరబాబు, సూరిబాబు, పీఆర్ మూర్తి, పీవీ లక్ష్మి, కృష్ణవేణి, పార్వతి పాల్గొన్నారు.