
కుమార్తె పుట్టిన రోజే తండ్రికి ఆఖరి రోజు
రణస్థలం: మండలంలోని పైడిభీమవరం సమీపంలోని వరిసాం దగ్గర ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ముందు వెళ్తున్న లారీ అకస్మాత్తుగా ఆపడంతో వెనుక బైక్‌పై వెళ్తున్న బొద్దాన హరీష్‌రావు(25) లారీని ఢీకొట్టి గాయాలపాలై ఆస్పత్రిలో మృతిచెందాడు. కూతురి పుట్టిన రోజు వేడుకలు చేసుకుని మిగిలిన భోజనాలు రోడ్డు పక్కన ఉన్న వారికి ఇద్దామని వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. జేఆర్ పురం పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం..
జేఆర్ పురం పంచాయతీ వెంకటేశ్వర కాలనీలో నివాసం ఉంటున్న హరీష్‌రావుకు అదే పంచా యతీలోని సీతంపేట గొల్లపేటలోని అమ్మాయితో పెళ్లయ్యింది. వీరికి నాలుగేళ్ల కూతురు ఉత్తర, ఆరు నెలల కుమారుడు రేవంత్ ఉన్నారు. ఆదివారం ఉత్తర పుట్టిన రోజు. దీంతో హరీష్‌రావు అత్తవారింట కుటుంబ సభ్యులతో కలిసి విందు చేసుకున్నాడు. తన బావమరిది పుట్టిన రోజు వేడుక కూడా చేసుకున్నాడు. ఈ రెండు కార్యక్రమాల్లో భోజనాలు మిగిలిపోవడంతో రోడ్డు పక్కన బిచ్చగాళ్లకు ఇద్దామని సీతంవలస అత్తవా రి ఇంటి నుంచి ఆదివారం రాత్రి 9.30 గంటల సమయంలో పైడిభీమవరం వరకు మూడు బైక్‌లపై తొమ్మి ది మంది బయల్దేరారు. దారి పొడవునా కొందరికి ఇచ్చారు. తిరుగు ప్రయాణంలో రణస్థలం వైపు వస్తుండగా వరిసాం వద్ద ఆదివారం అర్ధరాత్రి 12.15 గంటల సమయంలో ముందు వెళ్తున్న లారీ సడెన్‌గా ఆపడంతో బైక్‌లు ఆ లారీని ఢీకొన్నా యి. హరీష్‌రావుకు బలమైన గాయాలై తీవ్ర రక్తస్రావం కావడంతో.. స్నేహితులు బైక్‌పై రణస్థలంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువచ్చారు. అక్కడ చికిత్స అందించే సమయంలో మృతి చెందాడు. వెనుక కూర్చుని ఉన్న మరో ఇద్దరు కోరాడ దుర్గ, గొర్లె భాస్కరరావులకు తీవ్ర గాయాలకు కావడంతో 108లో శ్రీకాకుళంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
మృతుని భార్య ఉమ, తల్లి దమయంతి ఇంటిలోనే ఇండగా, తండ్రి అసిరయ్య రణస్థలం మండల కేంద్రంలో రిక్షా తొక్కుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. కుమార్తె పుట్టిన రోజు వేడుకలో మిగిలిన భోజనం పడేద్దామని కుటుంబ సభ్యులు చెప్పినా.. కాదని ఏవరో ఒకరికి ఇస్తే పుణ్యమని బయలుదేరి వెళ్లి ఇలా విగతజీవిగా మారడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రమాదంపై మరో క్షతగాత్రుడు గొర్లె భాస్కరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జేఆర్ పురం ఎస్‌ఐ చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
పుట్టిన రోజు వేడుకల్లో మిగిలిన భోజనాలు పంచేందుకు వెళ్తుండగా ప్రమాదం
జేఆర్‌పురంలో విషాద ఛాయలు

కుమార్తె పుట్టిన రోజే తండ్రికి ఆఖరి రోజు