
ఎత్తిపోతలు.. ఉత్తి మాటలు
హిరమండలం వద్ద నత్తనడకన సాగుతున్న ఎత్తిపోతల పథకం పనులు
హిరమండలం:
పాలకుల నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారుతోంది. ముఖ్యంగా జిల్లాలోని కీలక ప్రాజెక్టు గొట్టా బ్యారేజీ వద్ద ఎత్తిపోతల పథకం పనుల విషయంలో ఈ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. వైఎస్సార్ సీపీ హయాంలో ఏడాదిలో 33 శాతం పనులు జరిగితే.. కూటమి ప్రభుత్వం ఏడు శాతానికి మించి పనులు చేయలేకపోయింది. వ్యవసాయమే ప్రధాన జీవనాధారంగా ఉన్న శ్రీకాకుళం జిల్లాకు ఒక సాగునీటి ప్రాజెక్టు అవసరమని 2003 పాదయాత్రలో వైఎస్ రాజశేఖర రెడ్డి మొదటగా గుర్తించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జలయజ్ఞంలో భాగంగా వంశధార రిజర్వాయర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అయితే ఈ రిజర్వాయర్ నిండాలంటే నేరడి వద్ద బ్యారేజీ నిర్మాణం చేపట్టాలి. కానీ దీనికి ఒడిశా అభ్యంతరాలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఒడిశాతో జల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తూనే.. ప్రత్యామ్నాయంగా 2022 సెప్టెంబరు 14న గొట్టా బ్యారేజీలో ఎత్తిపోతల పథ కం నిర్మాణానికిగాను రూ.176.35 కోట్లు మంజూరు చేశారు. అప్పటి మంత్రి ధర్మాన ప్రసాదరావు కీలక పాత్ర పోషించారు. హైదరాబాద్‌కు చెందిన సంస్థకు టెండర్లు కేటాయించారు. దీంతో శరవేగంగా పనులు జరిగాయి. 2024 ఎన్నికల నాటికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏకంగా 33 శాతం పను లు పూర్తిచేసింది. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన ఈ ఏడాదిలో కేవలం 7 శాతం పనులను మాత్రమే పూర్తిచేసింది. ఇంకా ప్రధాన విభాగాలకు సంబంధించి పనులు ఇంతవరకూ ప్రారంభం కాలే దు. పనుల్లో ఆశించిన స్థాయిలో పురోగతి లేదు. ఇప్పట్లో పనులు పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు.
వాస్తవంగా భామిని మండలం నేరడి వద్ద బ్యారేజీ నిర్మాణం పూర్తయితే రిజర్వాయర్‌లో నీటి స్థిరీకరణకు ఎలాంటి ఢోకా ఉండదు. కానీ ఒడిశా ప్రభుత్వంతో వివాదం కారణంగా ఎడతెగని జాప్యం జరుగుతోంది. దీంతో అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఒక ఆలోచనకు వచ్చింది. ఒడిశాతో ఒకవైపు జలాల సమస్యకు పరిష్కార మార్గం చూపుతూనే.. గొట్టా బ్యారేజీ కుడి ప్రధాన కాలువ నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా 12 టీఎంసీలను రిజర్వాయర్‌లోకి తరలించాలని ఆలోచన చేశారు. 2022 సెప్టెంబరు 14న రూ.176.35 కోట్లు మంజూరు చేశారు. 2023 ఆగస్టులో హైదరాబాద్‌కు చెందిన సంస్థ టెండర్లు దక్కించుకొని పనులు ప్రారంభించింది. అక్కడకు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేవరకూ రూ.140.07 కోట్లతో 33 శాతం పనులు పూర్తిచేసింది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి న తర్వాత పనులు మందగించాయి. చెల్లింపులు నిలిచిపోయాయి. ఆ ప్రభావం పనులపై పడింది. కూటమి ప్రభుత్వం రూ.182 కోట్లు మంజూరు చేసినట్టు చెప్పినా.. పనులు మాత్రం ఆశించిన స్థాయి లో జరగలేదు. ఈ ఏడాది కూటమి పాలనలో ఎత్తిపోతల పథకానికి సంబంధించి పనులు 7 శాతం మాత్రమే పూర్తయ్యాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
కానరాని పురోగతి..
ప్రస్తుతం ఎత్తిపోతల పథకం పనులు నత్తనడకన జరుగుతున్నాయి. పనుల తీరు చూస్తుంటే ఇప్పట్లో పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు. మరోసారి వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చి ఉంటే ఇప్పటికే పనులు కొలిక్కి వచ్చేవన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గొట్టా బ్యారేజీ ఆర్‌ఎంసీ హెడ్ రెగ్యులేటర్ నుంచి 2.4 కిలోమీటర్ల పొడవున కాలువ వెడల్పు ఐదు మీటర్ల చొప్పున పెంచాల్సి ఉంటుంది. మెరుగైన విద్యుత్ సరఫరా కోసం సబ్‌స్టేషన్ ఏర్పాటుచేయాల్సి ఉంది. పంపుహౌస్ పనులు పూర్తిచేయాల్సి ఉంది. ఏపీ ట్రాన్స్‌కోకు రూ.9.18 కోట్ల బకాయిల చెల్లించాల్సి ఉంది. 3.2 మీటర్ల 110 పైపులను తయారుచేశారు. వీటిని అమర్చాల్సి ఉంది. ఈ ఎత్తిపోతల పథకానికి సంబంధించి జలాశయం గట్టుపై డెలివరీ సిస్టమ్స్‌కు ఇంతవరకూ అనుమతి రాలేదు. ఇన్ని పనులు పెండింగ్‌లో ఉంటే కూటమి పాలకులు ఎత్తిపోతల పథకం విషయంలో ఆర్భాటపు ప్రకటనలు చేస్తున్నారు.
బహుళ ప్రయోజనాలు ఎన్నో..
ఇక్కడ ఎత్తిపోతల పథకం పూర్తయితే కానీ జలాశ యం లక్ష్యం నెరవేరదు. కేవలం వర్షాకాలంలో అతిగా వచ్చే వరదలు సైడ్ వీయర్ ద్వారా రిజర్వాయర్‌లోకి నీరు చేరుతుంది. అంతే తప్ప వంశధారలో సాధారణ ప్రవాహం ఉన్నప్పుడు రిజర్వాయర్‌లోకి నీరు చేరే అవకాశమే లేదు. అందుకే అత్యవసరంగా ఇక్కడ ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేయాల్సి ఉంది. రిజర్వాయర్‌లోకి 12 టీఎంసీల నీటిని నిల్వ ఉంచవచ్చు. అదే జరిగితే ఏడాది పొడ వునా శ్రీకాకుళం జిల్లాను సస్యశ్యామలం చేయవ చ్చు. వంశధార కుడి, ఎడమ ప్రధాన కాలువల ద్వారా 2.11 లక్షల ఎకరాల ఆయకట్టుకు పుష్కలంగా సాగునీరు అందించవచ్చు. ఖరీఫ్‌తో పాటు రబీలో కూడా ఇబ్బందులు లేకుండా చూడవచ్చు. నదుల అనుసంధానం, నారాయణపురం ఆనకట్ట ద్వారా మరో 25 వేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. ఉద్దానం ప్రజల దాహార్తిని తీర్చే ఉద్దానం సమగ్ర మంచినీటి పథకానికి 1.12 టీఎంసీల తాగునీరు అందిచవ చ్చు. ఇన్ని ప్రయోజనాలున్న ఈ ఎత్తిపోతల పథకంపై కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది.
కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం
కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం జిల్లా రైతులకు శాపంగా మారుతోంది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా ప్రజల ఆకాంక్షను తీర్చేందుకు.. పుష్కలంగా సాగునీరు అందించేందుకు ఎత్తిపోతల పథకం ఆలోచన చేశారు. వెనువెంటనే నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏడాదిలో 33 శాతం పనులు చేయిస్తే.. కూటమి ప్రభుత్వం ఏడాదిలో 7 శాతం పనులు మాత్రమే పూర్తిచేయగలిగింది. కూటమి ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది.
– రెడ్డి శాంతి, మాజీ ఎమ్మెల్యే, పాతపట్నం
గొట్టా బ్యారేజీ ఎత్తిపోతల పథకం పనుల్లో చిత్తశుద్ధి కరువు
వైఎస్సార్‌సీపీ హయాంలో ఏడాదిలో 33 శాతం పూర్తి
కూటమి ఏడాది పాలనలో కేవలం 7 శాతమే
పాలకుల నిర్లక్ష్యం.. రైతులకు శాపం

ఎత్తిపోతలు.. ఉత్తి మాటలు

ఎత్తిపోతలు.. ఉత్తి మాటలు