
కూటమిది కక్షపూరిత పాలన
శ్రీకాకుళం అర్బన్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలేసి కక్షపూరిత పాలన సాగిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ధ్వజమెత్తారు. చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడుదల రజినిపై సీఐ సుబ్బనాయుడు అనుచిత ప్రవర్తన, గుంటూరు జిల్లాలో వైఎస్సార్‌సీపీకి చెందిన దళిత మహిళ, ఎంపీటీసీ కల్పన పట్ల కూటమి ప్రభుత్వం వ్యవహరించిన తీరుకు నిరసనగా.. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో శ్రీకాకుళంలోని వైఎస్సార్ కూడలి వద్ద పార్టీ నా యకులు నల్ల బ్యాడ్జీలు ధరించి ఆదివారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు ఉలాల భారతి దివ్య, పార్టీ నాయకులు ముంజేటి కృష్ణమూర్తిలు మాట్లాడుతూ చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడుదల రజినిపై సీఐ సుబ్బనాయుడు అనుచితంగా ప్రవర్తించిన తీరు దారుణమన్నారు. మాజీ మంత్రి, మహిళ అని కూడా చూ డకుండా సీఐ రజినిని పక్కకు తోసేయడం పోలీ సుల దుశ్చర్యకు నిదర్శనమన్నారు. మహిళలపై కూటమి ప్రభుత్వానికి, పోలీసులకు ఎంతటి గౌర వం ఉందో ఈ సంఘటన ద్వారా స్పష్టంగా తెలు స్తోందన్నారు. వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ కల్పన ఒక దళిత మహిళ అని చూడకుండా అర్ధరాత్రి ఆమెను అరెస్ట్ చేసి నైటీలోనే పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లారని, ఇది అత్యంత దారుణమన్నారు.
రాష్ట్రంలోని రైతులకు, నిరుద్యోగులకు, మహిళలకు కూటమి ప్రభుత్వం, నాయకులు హామీలు ఇచ్చారని, వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని దుయ్యబట్టారు. తమ తప్పులు కప్పి పుచ్చుకునేందుకు, ప్రజలను తప్పుదారి పట్టించేందుకు రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని అన్నారు. శ్రీకాకుళం రూరల్ జెడ్పీటీసీ రుప్ప దివ్య, వైఎస్సార్‌సీపీ దళిత విభాగం జిల్లా అధ్యక్షుడు పొన్నాడ రుషి మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలపై కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందన్నారు. ఎల్లకా లం కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉండదని గుర్తు పెట్టుకోవాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గేదెల పురుషోత్తం, నాయకులు అంబటి శ్రీనివాసరావు, యజ్జల గురుమూర్తి, మూకళ్ల తాతబాబు, గుంట జ్యోతి, సీపాన రామారావు, రావాడ జోగినాయుడు, ఎస్.వెంకటరావు, సతివాడ రామినాయుడు, పి.రాజశేఖర్, అలపాన త్రినాథ రెడ్డి, ఎన్.కృష్ణ, తవిటినాయుడు, ఎ.రమేష్, సీహెచ్ గడ్డెయ్య తదితరులు ఉన్నారు.
రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు
మహిళలపై అనుచిత ప్రవర్తన
ధర్నాలో వైఎస్సార్‌సీపీ నాయకుల ధ్వజం