ప్రశాంతంగా ముగిసిన పది పరీక్షలు
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఎన్న డూ లేని విధంగా జిల్లా ఈ సారి సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది. కుప్పిలి కాపీయింగ్ ఉదంతం మినహా టెన్త్ పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలో 149 కేంద్రాల్లో మార్చి 17న మొదలైన పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మంగళవారంతో ముగిశాయి. పోలీసుల సహకారంతో 144 సెక్షన్ పక్కాగా అమలు చేశారు. కలెక్టర్, జిల్లా ఎస్పీ సైతం పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. ఆఖరి రోజు సోషల్ స్టడీస్ పేపర్‌కు 28405 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 28254 మంది హాజరయ్యారు. 151 మంది గైర్హాజరయ్యారు. మొత్తం మీద ప్రధాన పరీక్షల న్నీ ముగియడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. కాగా ఏప్రిల్ మూడో తేదీ నుంచి మూల్యాంకన ప్రక్రియ మొదలుకానుండగా.. అందుకు డీఈఓ తిరుమల చైతన్య, ఏసి లియాకత్ ఆలీఖాన్ నేతృత్వంలో అధికారులు సన్నద్ధం చేస్తున్నారు.
జిల్లా చరిత్రంలో.. మాయని మచ్చగా
జిల్లాలోని ఎచ్చెర్ల మండల పరిధి కుప్పిలి మోడల్ స్కూల్ ఏ, బీ కేంద్రాల్లో మార్చి 21వ తేదీన ఇంగ్లిష్ పేపర్ మాస్ కాపీయింగ్ ఉదంతం మాయని మచ్చలా మిగిలిపోయింది. డీఈఓ తిరుమల చైతన్య నేతృత్వంలో స్క్వాడ్ బృందాలు తనిఖీ చే యడం, ఐదుగురు విద్యార్థులను డీబార్ చేయ డం, ఏకంగా 15 మందిని సస్పెండ్ చేయడం, ఆపై టీచర్లు డీఈఓ వైఖరిపై ఆందోళనలు చేయడం వంటివి సంచలనం సృష్టించాయి.
‘నాడు–నేడు’తో సకల సౌకర్యాలు..
టెన్త్ పరీక్షలకు కేటాయించిన 149 కేంద్రాల్లో మెజారిటీ కేంద్రాలు ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు కావడంతో విద్యార్థులు సౌకర్యవంతంగా పరీక్షలు రాశారు. బడుల్లో మనబడి నా డు–నేడు కార్యక్రమం ద్వారా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సమకూర్చిన వసతులు, సౌకర్యాలతో విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాశారు. అత్యాధునిక ఫర్నీచర్, విద్యుత్, ఫ్యాన్లు, లైట్లు, ఆర్వో ప్లాంట్ల ద్వారా తాగునీరు, మరుగుదొడ్లు ఇలా అన్ని మౌలిక సదుపాయాలు కేంద్రాల్లో అందుబాటులో ఉండటంతో అక్కడి అధికారులు ఎలాంటి ఒత్తిడికి గురికాలేదు. పరీక్ష కేంద్రాల వద్ద పలు ప్రైవేటు జూనియర్ కాలే జీలు, పాలిటెక్నిక్ కాలేజీలు, డిఫెన్స్ అకాడమీల కరపత్రాలను విద్యార్థులకు పంచేందుకు ఆ సంస్థ ప్రతినిధులు, సిబ్బంది ఎగబడ్డారు. పరీక్షలు ముగియడంతో హాస్టళ్లు, వసతి కేంద్రాల్లో ఉంటున్న విద్యార్థులు ఇంటిబాట పట్టారు.
జిల్లాలో మొదటిసారి సంచలనాలకు కేంద్రం బిందువుగా టెన్త్ పబ్లిక్ పరీక్షలు
జిల్లా చరిత్రలో మాయని మచ్చలా కుప్పిలి కాపీయింగ్ ఉదంతం
పరీక్షలు ముగియడంతో హాస్టళ్ల నుంచి ఇంటి బాట పట్టిన విద్యార్థులు


