
● జిల్లా పోలీసు శాఖకే స్వాట్ శిక్షణ గర్వకారణం ● విశాఖపట్నం రేంజ్ డీఐజీ హరికృష్ణ ● అబ్బురపరిచేలా స్వాట్ ప్రదర్శన
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాకు చెందిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ నుంచి పోలీసు సిబ్బంది స్వాట్ (స్పెషల్ వెపన్స్ అండ్ టాక్టిక్స్) శిక్షణ పొందడం జిల్లా పోలీసు శాఖకే గర్వకారణం అని విశాఖపట్నం రేంజ్ డీఐజీ ఎస్.హరికృష్ణ కొనియాడారు. జిల్లాలోని విపత్కర పరిస్థితుల్లో ఈ శిక్షణ పొందిన పోలీసుల సేవలు అవరసమని భావించిన ఎస్పీ జీఆర్ రాధిక వీరి శిక్షణ ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లారు. దీంతో ఆక్టోపస్ కమాండోలతో జిల్లా పోలీసు సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ ముగింపు కార్యక్రమం శుక్రవారం సాయంత్రం స్థానిక ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఐజీ హాజరయ్యారు. రెండు నెలలుగా 32 మంది స్పెషల్ టాస్క్‌ఫోర్స్ సిబ్బందికి తండేవలస జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో ఆక్టోపస్ కమాండోలతో కఠోర శిక్షణ తరగతులు నిర్వహించారు. సుశిక్షితులైన స్వాట్ కమాండోలు విపత్కర పరిస్థితుల్లో ఉగ్రమూకలపై ఏ విధంగా ప్రతిదాడి చేస్తారో ఇక్కడ ప్రదర్శన ఇచ్చారు. స్థానికులు వీటిని చూసి అబ్బురపడ్డారు.