
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): ఇంటి బాధ్యతలు చక్కదిద్దేది మహిళలేనని, ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ‘ఆసరా’ని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అందిస్తున్నారని రాష్ట్ర రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం నగరంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద టౌన్‌హాల్‌లో కమిషనర్ చల్ల ఓబులేసు, మెప్మా పీడీ కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం వైఎస్సార్ ఆసరా చెక్కుల పంపిణీ చేపట్టారు. జ్యోతిరావు పూలే కాలనీ, కాకి వీధి, దండి వీధి, బాదుర్లపేట, సి.బి.రోడ్, మంగువారితోట లబ్ధిదారులతో ఈ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి ధర్మాన మాట్లాడుతూ వంటింటికే పరిమితం చేసిన తరం నుంచి మహిళలను చైతన్యవంతురాలుగా తయారుచేసేందుకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అనేక పథకాలు అమలుచేస్తోందన్నారు. చంద్రబాబు హయాంలో 2014 నుంచి 2019 వరకు స్వయంశక్తి సంఘాలకు చెందిన మహిళలు బ్యాంక్ మెట్లు ఎక్కాలంటే భయపడేవారని, సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక సంబంధిత సమస్యను పరిష్కరించారని చెప్పారు. ఇదంతా మీరు జగన్‌మోహన్‌రెడ్డికి అధికారం ఇవ్వడం వల్లే సాధ్యమైందన్నారు. ప్రజల మేలు కోరుకునే నాయకులు వస్తే బతుకులు బాగుపడతాయన్నారు. అనంతరం నగరపాలక సంస్థని పరిశుభ్రంగా ఉంచుదాం, మా ఇంటి నుంచి చెత్త సేకరణకు మేము సహకరిస్తాం..నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుతాం అంటూ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో యువనేత ధర్మాన రామ్‌మనోహర్‌నాయుడు, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ ఎం.వి.పద్మావతి, మాజీ మహిళా కమిషన్ చైర్మన్ త్రిపురాన వెంకటరత్నం, సాధు వైకుంఠంరావు, కోణార్క్ శ్రీను, రుప్ప శేషగిరి, కర్నేన పద్మా, కర్రి రంగాజి దేవ్, పాపారావు, రావాడ జోగినాయుడు, గెంజి వాసు, సుగుణా రెడ్డి, అల్లిబిల్లి విజయ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
వైఎస్సార్ ఆసరా సభలో మంత్రి ధర్మాన ప్రసాదరావు