
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): పవిత్రమైన వైద్య వృత్తిలో ఉంటూ, ఆ వృత్తిని వ్యక్తిగత స్వార్థానికి వాడుకుంటారా అని ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం నాయకుడు డాక్టర్ దానేటి శ్రీధర్ ప్రశ్నించారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రజాసేవ చేస్తారన్న నమ్మకంతో వైఎస్ జగన్ శ్రీదేవికి పార్టీ టికెట్ ఇచ్చి గెలిపించారని, ఆ గౌరవాన్ని నిలబెట్టుకోలేకపోయారని విమర్శించారు. శ్రీదేవి గెలిచిన తర్వాత ప్రజలకు ఏం చేశారని, హైదరాబాద్‌లో ఉంటే నియోజకవర్గం ప్రజలకు ఏం సేవలు అందించగలరని ప్రశ్నించారు.
దళిత మహిళగా అంబేడ్కర్ ఆశయాలను పాటించకుండా తూట్లు పొడిచారని మండిపడ్డారు. తాను కూడా ఒక వైద్యుడినేనని, డాక్టర్లను సీఎం వైఎస్ జగన్ ఎంతగా గౌరవిస్తారో తనకు తెలుసని పేర్కొన్నారు. శ్రీదేవి ఏనాడూ ప్రజల మధ్యలో లేరని, ప్రజా విశ్వాసం కోల్పోయారని తెలిపారు. సీఎం జగన్ చాలా గొప్ప వ్యక్తి అని మీడియాతో చెప్పి మళ్లీ ఆయనపైనే విమర్శలు చేయడం తగదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు అమ్ముకోవడం వాస్తవమా.. కాదా అని సూటిగా ప్రశ్నించారు. శ్రీదేవి వైఖరితో వైద్యవృత్తికే కళంకం వచ్చిందని, వెన్నుపోటు పొడిచిన వారు చరిత్రహీనులుగా మిగిలిపోతారని పేర్కొన్నారు.