పుట్టపర్తి అర్బన్: ద్రోణి ప్రభావంతో రెండు రోజులుగా జిల్లాలో అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం సాయంత్రం నుంచి గురువారం ఉదయం వరకూ జిల్లాలోని 7 మండలాల పరిధిలో వర్షాలు కురిసినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అత్యధికంగా తనకల్లు మండలంలో 34.2 మి.మీ వర్షపాతం నమోదైంది. అలాగే అమడగూరు మండలంలో 24 మి.మీ, మడకశిర 12.6, నల్లచెరువు 12.2, హిందూపురం 11.2, చిలమత్తూరు 9.0, లేపాక్షి మండలంలో 2.0 మి.మీ మేర వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు.
జనగణన పక్కాగా జరగాలి
ప్రశాంతి నిలయం: జనగణన పక్కాగా నిర్వహించాలని జేసీ మౌర్య భరద్వాజ్ ఆదేశించారు. జనగణనలో నిమగ్నమైన అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేసి లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. గురువారం ఆయన సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ... ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లకు అవసరమైన కిట్లు, మ్యాపులు, మాన్యువళ్లు ఇప్పటికే పంపామన్నారు. మే 30వ తేదీ నాటికి జనగణన ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఎక్కడైనా సమస్యలు తలెత్తితే 24 గంటల్లో పరిష్కరించాలన్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా సిబ్బంది మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకూ క్షేత్రస్థాయి పర్యటనలు నివారించి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
గుప్తనిధుల వేటగాడిని
పట్టుకున్న గ్రామస్తులు
చిలమత్తూరు: మండలంలోని మాదిరెడ్డిపల్లి సమీపంలో ఉన్న వెంకన్న కొండ గుహలో గుప్త నిధుల కోసం గురువారం తవ్వకాలు సాగిస్తున్న విశాఖపట్నంకు చెందిన మంకు నాయుడుని మాదిరెడ్డిపల్లి గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కాగా, మంకు నాయుడు కొడికొండ చెక్‌పోస్ట్ సమీపంలోని ఓ గదిని అద్దెకు తీసుకుని పది రోజులుగా గుహలో గుప్తనిధుల కోసం తవ్వకాలు సాగిస్తున్నట్లుగా గుర్తించారు. దీంతో నిందితుడి గదిని పోలీసులు పరిశీలించారు. బ్లాస్టింగ్ యంత్రాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
పుట్‌బాల్ విజేత అనంత
అనంతపురం: శాప్ రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్ టోర్నీ విజేతగా అనంతపురం జట్టు నిలిచింది. అండర్–15 బాయ్స్ విభాగంలో కృష్ణా జట్టుపై విజయం సాధించింది. బాలికల విభాగంలో తూర్పు గోదావరి జట్టుపై శ్రీసత్యసాయి జట్టు గెలుపొందింది. అండర్ –21 పురుషుల విభాగంలో విశాఖపై విజయనగరం, మహిళల విభాగంలో కర్నూలుపై అనంతపురం గెలుపొందింది.


