రూటు మార్చిన కేటుగాళ్లు | - | Sakshi
Sakshi News home page

రూటు మార్చిన కేటుగాళ్లు

Dec 19 2025 8:33 AM | Updated on Dec 19 2025 8:33 AM

రూటు

రూటు మార్చిన కేటుగాళ్లు

రామగిరి మండలానికి చెందిన సాకే సదాశివ కలెక్టరేట్‌ ఉద్యోగి నంటూ జనాన్ని బురిడీ కొట్టించాడు. పింఛన్లు ఇప్పిస్తానని నమ్మబలికి పుట్టపర్తిలో రూ.లక్షల్లో వసూలు చేసి పరారయ్యాడు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు గాలించి ఇటీవల అదుపులోకి తీసుకున్నారు. అతడిపై గతంలోనూ చాలా కేసులు ఉన్నట్లు రామగిరి పోలీసులు తెలిపారు. ఈ ఘటన గత అక్టోబరులో వెలుగు చూసింది.

గత మే నెల 8వ తేదీన తనకల్లు మండలం కొక్కంటి క్రాస్‌లో ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ పేరుతో ఓ మహిళ హల్‌చల్‌ చేసింది. బేకరీ, హోటల్‌, చికెన్‌ పకోడా దుకాణాల్లో తనిఖీల పేరుతో ఒక్కొక్కరి నుంచి రూ.1,500 చొప్పున వసూలు చేసింది. ఆమె ప్రవర్తనపై అనుమానం రావడంతో కొందరు ఫుడ్‌ సేఫ్టీ కార్యాలయానికి ఫోన్‌ చేసి ఆరా తీయగా... ఆశాబీ పేరుతో ఎవరూ లేరని తేల్చి చెప్పారు. ఆలోపే సదరు మహిళ అక్కడి నుంచి జారుకుంది.

పుట్టపర్తిలో ప్రైవేటు క్లినిక్‌ నిర్వహిస్తున్న డాక్టర్‌కు ఈ ఏడాది మార్చిలో పుట్టపర్తి మున్సిపల్‌ కమిషనర్‌ ప్రహ్లాద్‌ పేరుతో ఫోన్‌ కాల్‌ వచ్చింది. ఆస్తి పన్ను బకాయి చాలా ఉందని, వెంటనే చెల్లిస్తే సగం వరకూ మాఫీ అయ్యే అవకాశం ఉందని నమ్మబలికాడు. ఫోన్‌ పేకు డబ్బు పంపితే చాలంటూ తన నంబరు కూడా పంపాడు. అయితే ఆ డాక్టర్‌ తెలివిగా వ్యవహరించి.. అధికారులకు సమాచారం ఇచ్చాడు.

సాక్షి, పుట్టపర్తి

జీ మనీకి అలవాటు పడిన కొందరు అమాయకులను టార్గెట్‌ చేస్తున్నారు. ప్రభుత్వ అధికారుల పేరుతో హల్‌చల్‌ చేస్తున్నారు. మొబైల్‌ కాల్స్‌ ద్వారా నిమిషాల్లో డబ్బులు కొల్లగొడుతున్నారు. మోసపోయామని ప్రజలు తెలుసుకునే లోపే అక్కడి నుంచి పరారవుతున్నారు. ఆ తర్వాత మొబైల్స్‌ స్విచాఫ్‌ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఇటీవల కాలంలో జిల్లాలో వెలుగు చూశాయి.

పెరిగిన సైబర్‌ మోసాలు..

హిందూపురం, పుట్టపర్తి, కొత్తచెరువు, ధర్మవరం, కదిరి తదితర ప్రాంతాల్లో సైబర్‌ మోసాలు పెరిగిపోయాయి. దుండగులు అమాయక ప్రజలను టార్గెట్‌ చేసి బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు సమూహంగా ఏర్పడి.. కొత్త కొత్త మొబైల్‌ నంబర్ల నుంచి కాల్స్‌ చేస్తూ మాయమాటలు చెప్పి.. నిమిషాల వ్యవధిలో డబ్బులు లాగుతున్నారు. లాటరీ తగిలిందని.. పర్సనల్‌ లోన్‌ అప్రూవల్‌ అయిందని.. ట్యాక్స్‌ ఆన్‌లైన్‌లో కడితే రాయితీ వస్తుందని.. ఇలా పలు రకాలుగా మోసాలకు పాల్పడుతున్నారు.

నకిలీ కార్డులతో గుంపుగా వచ్చి..

నల్లమాడ, బుక్కపట్నం, ఓడీ చెరువు, కొత్తచెరువు, గోరంట్ల, తనకల్లు తదితర ప్రాంతాల్లో ఫుడ్‌ సేఫ్టీ అధికారుల పేరుతో దుకాణాలు, షాపింగ్‌ కాంప్లెక్స్‌లలో దుండగులు చొరబడుతున్నారు. వాహనాలను ప్రభుత్వ స్టిక్కర్లు వేసుకుని.. నకిలీ కార్డులు మెడలో వేసుకుని వసూళ్లు చేస్తున్నారు. అనుమానం వచ్చినవారు ఫుడ్‌ సేఫ్టీ విభాగంలో తమకు తెలిసిన వాళ్లు ఉన్నారని చెబితే.. అక్కడి నుంచి పరారవుతున్నారు. ఆ తర్వాత వారందరూ నకిలీ అధికారులని తేలింది.

అధికారులపైనే ఆరోపణలు..

కొందరు ప్రభుత్వ అధికారులు తమ పరిధిలో అక్కడక్కడా ఏజెంట్లను పెట్టుకుని నకిలీ ఐడీ కార్డులు అందజేసి వసూళ్లు చేయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీనిపై కొందరిని ప్రశ్నించగా.. తమకు సంబంధం లేదని దాట వేశారు. నకిలీ అధికారుల ఆచూకీ తెలిపితే.. తాము పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెబుతున్నారు. ఫుడ్‌ సేఫ్టీ, తూనికలు – కొలతలు, ఆదాయ పన్ను, కరెంట్‌ బిల్లు వసూలు, బ్యాంకుల్లో పర్సనల్‌ లోన్‌, క్రెడిట్‌ కార్డుల్లో ఆఫర్లు తదితర పేర్లతోనే ఎక్కువగా సైబర్‌ మోసాలు జరుగుతున్నాయి.

అధిక వడ్డీ ఆశ కల్పించి..

ఇటీవల కాలంలో సైబర్‌ నేరగాళ్లు టీ స్టాల్‌, హోటల్‌, చాట్‌ బాండార్‌లను అడ్డాగా చేసుకుంటున్నారు. అయా ప్రాంతాల్లో తిష్టవేసి అక్కడికి వచ్చే వారితో మాట కలుపుతారు. తమను ప్రభుత్వ అధికారులుగా పరిచయం చేసుకుని పదే పదే ‘ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం’ అనే పేరు కనిపించే వాట్సాప్‌ గ్రూప్‌లను చూపిస్తూ నమ్మబలుకుతారు. ఫోన్‌ నంబరు ఇచ్చి.. వారం రోజుల పాటు ఉదయం, సాయంత్రం వేళల్లో ఫోన్లు చేస్తుంటారు. ఆర్థిక వివరాలు ఆరా తీస్తారు. తాము పెద్ద ప్రాజెక్టు చేస్తున్నామని కాస్త డబ్బు అవసరమని చెబుతారు. అధిక వడ్డీ ఇస్తామంటూ వల విసురుతారు. కొన్ని రోజులు నమ్మకంగా లావాదేవీల జరుపుతారు. ఆ తర్వాత భారీగా అమౌంట్‌ తీసుకుని ఉడాయిస్తారు. ఇలాంటి ఘటనలు అక్కడక్కడా వెలుగు చూస్తూనే ఉన్నాయి.

అధికారుల పేరుతో డబ్బు వసూలు

జిల్లాలో నకిలీ అధికారుల హల్‌చల్‌

పన్నుల రూపంలో ఆన్‌లైన్‌లో దందా

ఫుడ్‌ సేఫ్టీ పేరుతో చిల్లర రాబడుతున్న వైనం

రోజుకో చోట వెలుగు చూస్తున్న మోసాలు

రూటు మార్చిన కేటుగాళ్లు1
1/1

రూటు మార్చిన కేటుగాళ్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement