నేటి నుంచి ‘సుశాసన్ సప్తాహ్’
ప్రశాంతి నిలయం: సుపరిపాలన, ప్రజల నుంచి అందే ఫిర్యాదులకు శాశ్వత పరిష్కారం, మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో చేపట్టిన ‘సుశాసన్ సప్తాహ్ –ప్రశాసన్ గావ్‌కీ ఓర్’ కార్యక్రమం జిల్లాలో శుక్రవారం నుంచి ప్రారంభమవుతుందని కలెక్టర్ ఏ.శ్యాం ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. డిసెంబర్ 25వ తేదీ వరకు వారం రోజుల పాటు జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. తహసీల్దార్ కార్యాలయాలు, పంచాయతీల్లో ప్రత్యేక ప్రజా ఫిర్యాదు పరిష్కార శిబిరాలు నిర్వహించి పరిష్కరించిన సేవలను యాప్‌లో అప్లోడ్ చేయాలన్నారు. కార్యక్రమంలో భాగంగా డిసెంబర్ 23న జిల్లా స్థాయిలో ప్రచార–అవగాహన వర్క్‌షాపు నిర్వహించి జిల్లాలో అమలవుతున్న మంచి పరిపాలన విధానాలను సేకరించి పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు.
సర్వేయర్ ఇంట్లో
ఏసీబీ సోదాలు
తనకల్లు: మండల పరిధిలోని మల్లిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన సర్వేయర్ శ్రీరాములు ఇంట్లో బుధవారం రాత్రి పొద్దుపోయాక ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. శ్రీరాములు అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలంలోని మంగళం పంచాయతీలో విలేజ్ సర్వేయర్‌గా పని చేస్తున్నాడు. భూమి సర్వే చేయడానికి ఓ వ్యక్తి వద్ద రూ. 20 వేలు లంచం తీసుకుంటూ రెండు రోజుల క్రితం ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. దీంతో అవినీతి నిరోధక శాఖ అధికారులు సర్వేయర్ శ్రీరాములు స్వగ్రామమైన మల్లిరెడ్డిపల్లికి వచ్చి అతని ఇంట్లో సోదాలు చేసినట్లు సమాచారం.
ఏసీబీ డీఎస్పీగా ప్రసాద్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ
అనంతపురం సెంట్రల్: ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు చేయాల్సిన పనికి లంచం డిమాండ్ చేస్తే అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారులకు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ ప్రసాద్‌రెడ్డి సూచించారు. గురువారం నగరంలోని ఏసీబీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. అంతకు ముందు డీఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. డీఎస్పీ ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ.. అవినీతి రహిత సేవల కోసం ప్రభుత్వం 1064 టోల్‌ఫ్రీ, 9440446181 డీఎస్పీ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఫిర్యాదుదారులు ధైర్యంగా ముందుకు రావాలని, అప్పుడే చట్టబద్ధంగా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఏసీబీ ఇన్‌స్పెక్టర్లు జయమ్మ, మోహన్‌ప్రసాద్, హమీద్‌ఖాన్, సిబ్బంది పాల్గొన్నారు.
కురాకులపల్లి పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్
అనంతపురం ఎడ్యుకేషన్: నిధుల దుర్వినియోగం విషయంలో కంబదూరు మండలం కురాకులపల్లి పంచాయతీ కార్యదర్శి వి.అశ్వర్థరెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. 15వ ఆర్థిక సంఘం నిధులు రూ. 15 లక్షల దాకా దుర్వినియోగం చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో అశ్వర్థరెడ్డిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.


