పర్యవేక్షణ కరువు.. పని బరువు
బత్తలపల్లి: రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన నకిలీ బర్త్ సర్టిఫికెట్లు వ్యవహారంలో అధికారుల పర్యవేక్షణ లోపం... సిబ్బంది నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఓ చిన్న పంచాయతీ పోట్లమర్రి నుంచి ఏకంగా 1,982 బర్త్ సర్టిఫికెట్లు జారీ అయిన విషయం కూడా జిల్లా అధికారులు గుర్తించకపోవడం విమర్శలు తావిస్తోంది. ఇక పోట్లమర్రి పంచాయతీ అధికారులు పని తప్పించుకునేందుకు జనన, మరణ ధ్రువీకరణ పత్రాన్నీ బత్తలపల్లి–1 సచివాలయం నుంచే జారీ చేయిస్తుండటంతో హ్యాకర్లు పోట్లమర్రి పంచాయతీ పరిధిలోని బత్తలపల్లి–3 సచివాలయం లాగిన్ ఐడీని హ్యాక్ చేసి ధ్రువీకరణ పత్రాలు పొందినట్లు తెలుస్తోంది.
లాగిన్ ఐడీ కూడా వాడని సిబ్బంది..
బత్తలపల్లి పంచాయతీ నుంచి వేరుపడి పోట్లమర్రి పంచాయతీ ఆవిర్భవించింది. అప్పటి నుంచి ఇక్కడ నలుగురు కార్యదర్శులు పని చేశారు. ప్రస్తుతం మండలంలోని సంజీవపురం సచివాలయ కార్యదర్శి భాస్కర్ పోట్లమర్రి పంచాయతీ ఇన్‌చార్జ్ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ఈ సచివాలయానికి లాగిన్ ఐడీ లేకపోవడంతో హ్యాకర్లు కొత్తగా లాగిన్ ఐడీ, పాస్ వర్డులను క్రియేట్ చేసుకొని బర్త్ సర్టిఫికెట్లు జారీ చేసుకున్నారనే విషయం తెలుస్తోంది. బత్తలపల్లి–3 సచివాలయ సిబ్బందే లాగిన్ ఐడీ క్రియేట్ చేసుకుని వాడి ఉంటే ఏ ధ్రువీకరణ పత్రం జారీ అయినా పంచాయతీ కార్యదర్శి సెల్‌ఫోన్‌కు ఓటీపీ వచ్చేది. తద్వారా నకిలీలకు పూర్తిగా చెక్ పడేది. కానీ ఇక్కడి సిబ్బంది తమ పంచాయతీ పరిధిలోని జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ బాధ్యతను కూడా బత్తలపల్లి–1 పంచాయతీకి అప్పగించడంతో హ్యాకర్ల పని సులువైనట్లు తెలుస్తోంది.
అసాంఘిక శక్తుల చేతుల్లో పడితే...
నకిలీ బర్త్ సర్టిఫికెట్లు అసాంఘిక శక్తుల చేతుల్లో పడితే జరిగే నష్టం మనం ఊహించలేం. మన పొరుగు దేశాల నుంచి అసాంఘిక శక్తులు తరచూ దేశంలోని వచ్చేసి విధ్వంసాలు సృష్టిస్తున్నాయి. అలాంటి వారు ఈ నకిలీ పత్రాలతో మన దేశ పౌరసత్వం పొందితే పరిస్థితి ఏమిటన్నది అంతుబట్టడం లేదు. ఇంత జరిగినా ఈ నకిలీ బర్త్ సర్టిఫికెట్ల వ్యవహారంలో పోట్లమర్రి పంచాయతీ అధికారులు నేటికీ పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
నకిలీ సర్టిఫికెట్లు జారీపై ఆరా
ఎంపీడీఓ నరసింహనాయుడు స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో గ్రామ/వార్డు సచివాలయాల అధికారి (ఎంజీఓ) రామ్మోహన్‌నాయుడు, పోట్లమర్రి పంచాయతీ ఇన్‌చార్జ్ కార్యదర్శి భాస్కర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నకిలీ సర్టిఫికెట్లు జారీ అంశంపై చర్చించారు. బత్తలపల్లి–3 సచివాలయానికి జనన, మరణ ధ్రువీకరణ పత్రాల లాగిన్ ఐడీ లేకపోవడం వల్ల హ్యాకర్లు లాగిన్ ఐడీ క్రియేట్ చేసుకుని నకిలీ సర్టిఫికెట్లు పొందారన్నారు. వాటిని వెంటనే రద్దు చేయాలని ఆదేశించారు. ఈ ఈ క్రమంలో 1,982 నకిలీ సర్టిఫికెట్లలో ఇప్పటి వరకు 450 సర్టిఫికెట్లును రద్దు చేసినట్లు కార్యదర్శి భాస్కర్ తెలిపారు. మిగిలిన వాటిని కూడా రెండు, మూడు రోజుల్లో రద్దు చేస్తామన్నారు.
నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారంపై
సర్వత్రా విమర్శలు
సచివాలయాలపై పర్యవేక్షణ లేక
అంతా ఇష్టారాజ్యం


