టేకులోడు సచివాలయానికి తాళం
చిలమత్తూరు: నెలల తరబడి నెలకొన్న నీటి సమస్య తీర్చడంలో పాలకుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ టేకులోడులో మహిళలు గురువారం నిరసనకు దిగారు. సచివాలయానికి తాళం వేసి ఖాళీ బిందెలతో బైఠాయించారు. స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ, ఆయన పీఏకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
బాలకృష్ణ పీఏ ఉత్తుత్తి హామీపై ఆగ్రహం
ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏ శ్రీనివాసరావు భూసేకరణ కోసం నిర్వహించిన గ్రామసభలో పాల్గొనేందుకు ఈ ఏడాది జూలై 26న టేకులోడుకు వచ్చాడు. ఆ సమయంలో పలువురు మహిళలు ఖాళీ బిందెలతో ఆయన్ను అడ్డుకున్నారు. తాగునీటి కోసం తాము అల్లాడిపోతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటి సమస్య తీర్చేంత వరకూ కదలనివ్వబోమంటూ భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో అప్పటికప్పుడు ఫోన్‌లో అధికారులతో మాట్లాడిన ఎమ్మెల్యే పీఏ శ్రీనివాసరావు వీలైనంత త్వరగా సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చి అక్కడి నుంచి జారుకున్నాడు. ఆరు నెలలు దాటినా ఆ హామీ నెరవేరకపోవడం.. తాగునీటి సమస్య ఇంకా తీవ్రతరం కావడంతో గురువారం మహిళలు సచివాలయం వద్దకు వెళ్లి ఆందోళనకు దిగారు. చేతగానప్పుడు ఎందుకు హామీలివ్వాలంటూ బాలకృష్ణపై పీఏ తీరును నిరసించారు. విషయం తెలుసుకున్న డిప్యూటీ ఎంపీడీఓ భాస్కర్ మహిళలతో మాట్లాడారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడంతో వారంతా ఆందోళన విరమించారు.
నీటి కోసం ఖాళీ బిందెలతో
మహిళలు బైఠాయింపు
ఎమ్మెల్యే పీఏ హామీ నీటమూట
అయ్యిందంటూ ఆగ్రహం


