రెడ్డెప్పశెట్టి అక్రమాలపై లోకాయుక్త కన్నెర్ర
చిలమత్తూరు: రియల్టర్ రెడ్డెప్పశెట్టి అక్రమాలపై లోకాయుక్త కన్నెర్ర చేసింది. ప్రభుత్వ భూములను నిర్మించి ఏకంగా చిత్రావతి నదిపైనే అక్రమంగా బ్రిడ్జి నిర్మించడంపై మండిపడింది. ఇంత జరుగుతున్నా... ఏం చేస్తున్నారంటూ కలెక్టర్ మొదలు హార్టికల్చర్, ఇరిగేషన్, ఆర్డీఓ, తహసీల్దార్‌లకు లోకాయుక్త నోటీసులు ఇచ్చింది.. దీంతో అధికార యంత్రాంగం ఆగమేఘాలపై కదిలింది.
అక్రమ బ్రిడ్జి, ఫారంపాండ్ల తొలగింపు..
రెడ్డెప్పశెట్టి ప్రభుత్వ భూములు ఆక్రమించి పాలీహౌస్‌లు నిర్మించడం, సాగునీటి కోసం చిత్రావతి నదిపై బ్రిడ్జి నిర్మించి సమీప ప్రాంతాల్లో పొలాలున్న రైతులను కూడా ఇబ్బందులకు గురి చేసిన వైనంపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించింది. అయినా అధికారులు స్పందించలేదు. ఈ క్రమంలోనే ఓ ఆర్టీఐ కార్యకర్త లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. ‘సాక్షి’ కథనాలను పరిశీలించిన లోకాయుక్త సంబంధిత అధికారులకు నోటీసులిచ్చింది. ఈ నెల 18వ తేదీలోపు అక్రమ నిర్మాణాలన్నీ తొలగించి ప్రభుత్వ భూములను కాపాడాలని పేర్కొంది. దీంతో శనివారం 40 మంది అధికారులతో కూడిన బృందం రెడ్డెప్పశెట్టి ఎస్టేట్‌లో ప్రవేశించింది. చిత్రావతి నదిపై అక్రమంగా నిర్మించిన బ్రిడ్జిని అధికారులు తొలగించారు. అంతేకాకుండా ఏపీఐఐసీ భూముల్లో నిర్మించిన ఫారం పాండ్‌ను తొలగిస్తున్నారు. ఉద్యానశాఖ సహకారంతో నిర్మించిన పాలీహౌస్‌ల అక్రమాలపై చర్యలకు పూనుకుంటున్నారు. సుమారు రూ.5 కోట్ల మేర జరిగిన అక్రమాలపై చర్యలకు ఉపక్రమించారు. అంతేకాకుండా రెడ్డెప్పశెట్టి ఆక్రమణలో ప్రభుత్వ భూమి 10 ఎకరాలు, ఏపీఐఐసీకి చెందిన 17.50 ఎకరాలు, ఇరిగేషన్ శాఖకు చెందిన 5 ఎకరాలను గుర్తించి బోర్డు నాటారు. రెడ్డెప్పశెట్టి మొత్తం మూడు ఫారం ఫాండ్లు నిర్మించగా... ఇందులో ఏపీఐఐసీ భూమిలో రెండు, ప్రభుత్వ భూమిలో ఒక ఫారం పాండు 30 అడుగులు లోతు నిర్మించినట్టు అధికారులు గుర్తించారు. ఇక మొరసలపల్లి వద్ద 18 ఎకరాల చెరువును కూడా ఆక్రమించుకున్నట్టుగా గుర్తించినట్టు సమాచారం. అధికారుల బృందంలో ఏపీఐఐసీ జోనల్ మేనేజర్, డీటీ జగన్నాథ్, ఇరిగేషన్ డీఈ శైలేంద్ర ఉన్నారు.
కలెక్టర్, తహసీల్దార్, ఆర్డీఓలతో పాటు పలువురికి నోటీసులు
ఆగమేఘాలపై స్పందించిన
జిల్లా యంత్రాంగం
చిత్రావతి నదిపై నిర్మించిన బ్రిడ్జిని తొలగించిన అధికారులు
ప్రభుత్వ భూముల్లోని
ఫారంపాండ్ల ధ్వంసానికి చర్యలు
రెడ్డెప్పశెట్టి ఆక్రమించిన
ప్రభుత్వ భూముల గుర్తింపు
రెడ్డెప్పశెట్టి అక్రమాలపై లోకాయుక్త కన్నెర్ర
రెడ్డెప్పశెట్టి అక్రమాలపై లోకాయుక్త కన్నెర్ర
రెడ్డెప్పశెట్టి అక్రమాలపై లోకాయుక్త కన్నెర్ర


