కరెంటు కట్‌తో జనం ఇక్కట్లు
పుట్టపర్తి టౌన్: సత్యసాయి శత జయంతి ఉత్సవాల కోసం రూ.కోట్లు వెచ్చించి పుట్టపర్తికి నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నామని సాక్షాత్తూ ఏసీఎస్పీడీసీఎల్ సీఎండీ చెప్పిన మాటలన్నీ ‘కోతలే’నని తేలిపోయింది. క్షేత్రస్థాయిలో మాత్రం గంటలకొద్దీ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. దీంతో జిల్లా కేంద్రం పుట్టపర్తి పట్టణంలోని అపార్ట్‌మెంట్ వాసులు అల్లాడిపోతున్నారు. 15 రోజులుగా ఎడాపెడా విద్యుత్ కోతలు మరింత ఎక్కువ కాగా లిఫ్ట్‌లు పనిచేయక ఇళ్లలోంచి బయటకు వెళ్లలేకపోతున్నారు. తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగుతోంది.
రెండు గంటల నరకయాతన : పశ్చిమ బెంగాలకు చెందిన ఓ సత్యసాయి భక్తురాలు హనుమాన్ కూడలిలోని సాయి సూపర్ జజార్ వెనుక ఉన్న సాయి స్మృతి అపార్టుమెంట్‌లోని ఐదో ఫ్లోర్‌లో నివాసం ఉంటున్నారు. శనివారం ఉదయం ఆమె 5వ ఫ్లోర్ నుంచి కిందకు వచ్చేందుకు లిఫ్ట్ ఎక్కారు. అయితే విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో ఆమె 2 గంటల పాటు లిఫ్ట్‌లోనే ఇరుక్కుపోయారు. భయబ్రాంతులకు లోనైన ఆమె గట్టిగా కేకలు వేసినా... ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పటికై నా విద్యుత్ శాఖ అధికారులు స్పందించి విద్యుత్ సరఫరాలో అంతరాయాన్ని నివారించాలని పట్టణ వాసులు కోరుతున్నారు.
పుట్టపర్తిలో తీవ్రమైన విద్యుత్ కోతలు
అల్లాడిపోతున్న అపార్ట్‌మెంట్ వాసులు
రెండు గంటలు లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన భక్తురాలు


